Oct 13,2021 15:25

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ రెండు మోతాదులు తీసుకున్నప్పటికీ మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కూడా బూస్టర్‌ డోస్‌ అవసరమని సూత్రప్రాయంగా తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు ఇప్పటికే బూస్టర్‌ డోస్‌ దిశగా దృష్టి సారించాయి. ఈ క్రమంలో మన దేశంలో కూడా బూస్టర్‌ డోస్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ వంటి వ్యాక్సిన్‌లు పంపిణీ జరుగుతోంది. అయితే బూస్టర్‌డోస్‌గా హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ను మూడో డోసుగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తోంది. దీనికనుగుణంగానే ఆ కంపెనీతో 30 కోట్ల డోసులకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఇందుకోసం రూ. 1500 కోట్లను ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లించింది. అయితే ఈ కంపెనీ తయారుచేసే కార్బివాక్స్‌ వ్యాక్సిన్‌కు ఇంకా డీసీజిఐ అనుమతులు ఇవ్వలేదు.
ప్రస్తుతం కార్బివాక్స్‌ టీకా రెండు, మూడు దశల క్లినికల్‌ ప్రయోగాలు కొనసాగుతున్నాయని, 18 నుంచి 80 ఏళ్లలోపు వారిపై ఈ పరీక్షలు జరుపుతున్నామని, ప్రయోగాల ఫలితాలను ఈ నెలాఖరులోగా వెల్లడించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లు తీసుకున్నవారికి కొన్ని నెలల తరువాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే బయోలాజికల్‌ - ఇ కంపెనీ కార్బివ్యాక్స్‌ను కోవిడ్‌ నెగెటివ్‌ ఉన్న వాలంటీర్లపై ప్రయోగాలు జరపాలనుకుంటున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అయితే దీనిపై నిపుణుల కమిటీ తమ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.