May 16,2022 13:34

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇటీవల నూతన వధూవరులు తమ వివాహ వేడుకల్లో వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో పెళ్లి దుస్తుల్లోనే డ్యాన్స్‌, యోగా, వ్యాయామాలు చేయగా, తాజాగా మరో జంట ఫైర్‌ స్టంట్‌ చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. గేబ్‌ జెస్సోప్‌ - అంబీర్‌ అనే వధూవరులిద్దరూ ప్రొఫెషనల్‌ స్టంట్‌ మాస్టర్స్‌. వీరిద్దరూ తమ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిలుచుని ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి అంబీర్‌ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్‌ బోకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలా వారి వీపుకి మంటలు అంటుకోగానే.. వారు అలానే కొంతదూరం నడించి.. ఆతర్వాత స్పీడుగా పరుగెత్తి ఒకచోట మోకాళ్లపై కూర్చున్నారు. వెంటనే ఇద్దరు వ్యక్తులు వచ్చి మంటల్ని ఆర్పేశారు. ఈ జంట చేసిన ఫైర్‌ స్టంట్‌కి... రిసెప్షన్‌కి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా, ప్రస్తుతం గేబ్‌, అంబిర్‌లు హాలీవుడ్‌లో స్టంట్‌ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. అందుకే వారు ఇంత అలవోకగా.. ఆ స్టంట్‌ చేశారు.
గమనిక : ఇలాంటి స్టంట్‌ చేయడం ప్రమాదకరం. ఎలాంటి శిక్షణ, అనుభవం లేనివారు ప్రయత్నించరాదు.