Jul 29,2021 19:12

పిల్లలూ, ఏనుగు తొండంలాంటి ముక్కు, నాలుగు వేల కిలోల బరువు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ జీవి పేరు ఎలిఫేంట్‌ సీల్‌. మరి దీని గురించి తెలుసుకుందామా?
అమెరికా, కెనడా, మెక్సికోలోని ఫసిఫిక్‌ తీర ప్రాంతాల్లో ఈ ఎలిఫెంట్‌ సీల్‌ కనిపిస్తుంది. శీతాకాలం ప్రారంభంలో ఎలిఫేంట్‌ సీల్‌లు ప్రతి ఏడాది కాలిఫోర్నియా నుంచి అలస్కా తీరానికి పసిఫిక్‌ సముద్రం మీదుగా వలస వెళతాయి. సుమారు 2000 నుంచి 3000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. రెండు నుంచి ఎనిమిది నెలల పాటు సముద్రంలో ఈదుతూనే ఉంటాయి. అవి అలిసిపోకుండా ఇన్ని వేల కిలోమీటర్లు ఎలా ఈదుతాయో తెలుసుకునేందుకు జపాన్‌ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాటి వీపులకి ఎలక్ట్రానిక్‌ టాగ్‌లను కట్టి ఉంచి, వాటి ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు.
వీటికి అలసట వస్తే వెల్లకిలా తిరిగి అలా ఉండిపోతాయి. ఈదడం ఆపేయడం వల్ల అవి నెమ్మదిగా నీళ్లలో లోతుల్లోకి జారిపోవడం మొదలుపెడతాయి. చెట్టు మీద నుంచి పడే ఆకు గిరగిరా తిరుగుతూ పడినట్టన్నమాట. అదే వాటి విశ్రాంతి. అలా కాసేపు కావాలని మునిగిపోయాక చటుక్కున లేచి ఓసారి ఒళ్లు విరుచుకుని మళ్లీ ఈదడం మొదలెడతాయి.
ప్రపంచంలో ఉన్న సీల్‌ చేపలన్నింటిలో ఎలిఫేంట్‌ సీల్‌ పెద్దది. వీటిలో రెండు జాతులు ఉన్నాయి. ఏనుగు సీల్స్‌ పుట్టినప్పుడు 36 కిలోల బరువు, 122 సెం.మీ పొడవు ఉంటుంది. ఇవి పిల్లల్ని కనడానికి మాత్రమే భూమి మీదకి వస్తాయి. ఒకసారి ఊపిరి పీల్చుకుంటే రెండు గంటలపాటు సముద్రంలో ఈదగలవు. చర్మం దళసరిగా ఉండడం వల్ల ఎంత చలినైనా తట్టుకోగలవు.