May 16,2022 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : షెడ్యూల్‌ పరిశ్రమల్లోని కార్మికులకు కనీస వేతనాల సవరణ కోసం జులైలో రాష్ట్ర వ్యాప్త ప్రచారం నిర్వహించాలని సిఐటియు నిర్ణయించింది. విజయవాడలోని రాష్ట్రకార్యాలయంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్శింగరావు అధ్యక్షతన 15, 16 తేదీల్లో రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ నివేదిక, భవిష్యత్తు కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. స్కీం వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రచారం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని, ఆగష్టులో నిరుద్యోగ సమస్యలపై విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి రాష్ట్ర సదస్సు నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. టిటిడి ఫారెస్ట్‌ కార్మికులు, శ్రీకాకుళం శ్యాంపిస్టోన్స్‌ కార్మికులు, విజయనగరం జిల్లా మైతాన్‌ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కమిటీ డిమాండ్‌ చేసింది. దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌కేంద్రం ప్రవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని కోరింది. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులపై ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే సంఘాలను కలుపుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.