Nov 26,2021 01:56

దీక్షల్లో నినాదాలు చేస్తున్న ఐఎఫ్‌టియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలన్న మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజా యుద్ధం తప్పదని ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 238వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రజల ఆస్తి అని, దీనిని ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. దీని వల్ల దళితులు, ఇతర బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కంటే, కేంద్రానికి స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా అందిన డబ్బు ఎన్నో వందల రెట్లు అధికమని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకొనే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐయఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు వై.కొండయ్య, కార్యదర్శి జి.లకీëనారాయణ, నాయకులు పి.లక్ష్మి, సిహెచ్‌.లక్ష్మి, సింహాచలం, ఐయఫ్‌టియుకు చెందిన గ్యాస్‌, జ్యూట్‌, హాస్పిటల్‌ సెక్టార్‌ కార్మికులు, సిఐటియు అనుబంధ మల్కాపురం ప్రాంత మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.