Jun 10,2021 20:09

జెరూసలెం : ఇజ్రాయిలీ దళాలు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌పై గురువారం తెల్లవారు జామున ముగ్గురు పాలస్తీనీయులను కాల్చి చంపింది. వీరిలో ఇద్దరు పాలస్తీనియన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఉన్నారు. మరణించిన ఇద్దరు అధికారులను ఆదామ్‌ యాసర్‌ అలావి (27), తైసీర్‌ ఇసా (32) గా గుర్తించినట్లు పాలస్తీనీయన్‌ వాఫా వార్తా సంస్థ తెలిపింది. ఈ కాల్పుల్లో మృతిచెందిన మూడో వ్యక్తి జమిల్‌ అల్‌ అమూరి. ఆయనను ఇజ్రాయిల్‌ జైలులో నిర్బంధంలో ఉండగానే కాల్చివేశారు. మరో పాలస్తీనియన్‌ అధికారి మహ్మద్‌ అల్‌ బజోర్‌ (23) తీవ్రంగా గాయపడ్డాడు. ఇజ్రాయిలీ దళాల దాష్టీకానికి నిరసనగా వేలాది మంది జెనిన్‌ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. పాలస్తీనియన్‌ పట్టణాల్లో సాధారణ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ దాడిని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ ఖండించారు. ఇజ్రాయిల్‌ ప్రమాదకర కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అరబ్బుల ముసుగులో వచ్చి ఇజ్రాయిల్‌ బలగాలు ముగ్గురిని హతమార్చాయని చెప్పారు. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకుని ఈ దాడులను ఆపాలని ఆయన కోరారు. దీనిపై ఇజ్రాయిల్‌ మిలటరీ, పోలీసులు వెంటనే స్పందించలేదు. ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూపుకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బలగాలు జెనిన్‌ వెళ్లాయని మాత్రమే ఇజ్రాయిల్‌ మీడియా తెలిపింది.