Oct 12,2021 20:13

మహిళలు శక్తి హీనులు. మానసికంగా, శారీరకంగా బలహీనులు. కొన్ని పనులు మాత్రమే చేయగలరు. పురుషుల వలె అన్ని పనులు చక్కబెట్టలేరన్న మూస ధోరణి సమాజంలో పాతుకుపోయి ఉంది. అయితే ఆ ఆలోచనలకు స్వస్తి పలికేలా చేసింది 21 ఏళ్ల సిక్కిం యువతి ఈక్షా హంగ్మా సుబ్బా. పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తూనే సూపర్‌ మోడల్‌గా, బాక్సర్‌గా విభిన్న రంగాల్లో రాణిస్తోంది.
ఈక్షా స్వస్థలం సిక్కిం రుంబక్‌ గ్రామం. చిన్నప్పటి నుంచి ప్రముఖ టెలివిజన్‌ సంస్థ ఎంటివి 'సూపర్‌మోడల్‌ ఆఫ్‌ ద ఇయర్‌' లో ప్రవేశించాలని కోరుకునేది. యుక్తవయసు రాగానే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకుని శిక్షణ తీసుకుంది. అలా ఆమె ప్రతి కల నెరవేరేలా తండ్రి ఎంతో ప్రోత్సహించారు. ఎక్కడా ఆమెను వెనకడుగు వేయనివ్వలేదు. తండ్రి సహకారంతోనే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది ఈక్షా. చేసే ప్రతి పనిలో రాణించేది. త్వరలో బాక్సింగ్‌ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధమవుతోంది.

విభిన్న రంగాల్లో తనదైన ముద్ర
అంతంత మాత్రమే ఉను తండ్రి ఆదాయం కుటుంబానికి ఏమాత్రం చాలకపోవడంతో ఆ బాధ్యతను భుజానెత్తుకుంది. అలా పిన్నవయసులోనే 19 ఏళ్లకే గ్రాడ్యుయేషన్‌ అర్హతతో సిక్కిం పోలీసు ఫోర్స్‌లో చేరింది. 14 నెలల కఠిన శిక్షణ తరువాత పోలీసు అధికారిగా విధులు చేపట్టింది. ఒక పక్క పోలీసు ఆఫీసరుగా, మరోపక్క బాక్సర్‌గా రాణిస్తూనే తన చిరకాల వాంఛ మోడలింగ్‌లో సత్తా చూపిస్తూనే ఉంది. రెండేళ్లకొకసారి జరిగే ఎంటివి మోడల్‌ షో ఆడిషన్‌లో పాల్గొని ఎంపికైంది. ముంబైకి పయనమైన ఈక్షా ముందు ఎన్నో కఠిన సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంది. బాహ్యంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ దూదిపింజలే.
ఈక్షా ఎంచుకున్న మార్గం స్త్రీల విభిన్న శక్తులకు ప్రతిరూపం. పోలీసు శిక్షణలో తను నేర్చుకున్న పాఠాలను/సవాళ్లను అందాల పోటీలకు అనుకూలంగా మార్చుకుంటున్నాను అని చెబుతోన్న ఈక్షా, ప్రస్తుత అందాల పోటీలో నాలుగో స్థానంలో నిలిచింది. కల నేర్చుకోవాలను పట్టుదలే ఆమెను ఈ స్థాయికి చేర్చాయి.