Jul 26,2021 06:12

మండుతున్న ఎండఘాటుని
నల్లమబ్బొకటి చినుకు రాల్చి
తరిమేసింది
అడివిని కాల్చేస్తున్న కార్చిచ్చుని
వానజల్లు తడిపేసింది

వాపు తగ్గని అహం చుట్టుకున్న ప్రదేశాన్ని
చిరునవ్వొకటి
మాటల పొదలా మార్చేసింది
మదమెక్కువై దూసుకెళ్తున్న
వాహనపుచక్రాన్ని
చిన్న మేకొకటి చీల్చేసింది

తెలివి తాగిన పక్షులు కొన్ని
చిక్కిన వలతోనే ఎగిరి
వేటగాడి దురాశని పూడ్చేశాయి
పూరిగుడిసొకటి
ఆక్రమిస్తానన్న మేడ
మెడనొంచి ధిక్కరించింది

నీ బాంచన్‌ దొర కాల్మొక్కుతామనే
వాళ్ళు కొందరు
పల్లకిని నేలవిడిచి భుజాన్నిదిలించి
నిటారుగా నిలబడ్డారు

యోచించు...!
ఎప్పుడు తిమింగలమే
చేపలను మింగేయాలా...
అవన్నీ ఏకమై తిమింగలాన్ని
ముంచేయొచ్చుగా....!
- శ్రీధర్‌ బాబు అవ్వారు
85001 30770