May 04,2021 12:31

న్యూయార్క్‌ : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా నుంచి విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోమవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'ఎన్నో సమాలోచనల అనంతరం మేమిద్దరం పరస్పర అంగీకారంతో.. విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. మా వైవాహిక బంధం (27 ఏళ్ల) లో మేం మా పిల్లల్ని తీర్చిదిద్దాం. అలాగే మా ఫౌండేషన్‌ ద్వారా ఎంతోమందికి సహాయం చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ జీవితంలోని తర్వాతి దశల్లో దంపతులుగా ఇక కొనసాగలేమని భావించాం. మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం' అంటూ బిల్‌గేట్స్‌, మెలిందా ట్విటర్‌ ద్వారా సంయుక్త ప్రకటనలో ప్రకటించారు. ప్రస్తుతం బిల్‌గేట్‌ వయసు 65, మెలిందా వయసు 56 ఏళ్లు. వీరు 1994లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జెన్నిఫర్‌ కాథరిన్‌ గేట్స్‌, రోరిజాన్‌ గేట్స్‌, ఫోబ్‌ అడిలె గేట్స్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 133 బిలియన్‌ డాలర్లు. మైక్రోసాఫ్ట్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాక 2000 సంవత్సరంలో బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు.