Sep 25,2021 12:17

న్యూఢిల్లీ : మహిళలు విడాకులు తీసుకోవడాన్ని సమాజంతో పాటు కుటుంబం అంగీకరించదు. భర్తతో వేరుగా ఉంటున్నారని తెలిస్తే.. నాలుగు రకాలుగా మాట్లాడుకునే ఈ సమాజం.. ఇక విడాకులు తీసుకుందని తెలిస్తే.. వెకిలి మాటలు, వెర్రి చేష్టలు ఎక్కువై పోతాయి. ఆమె ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకోకుండా కుటుంబ సభ్యులు, చుట్టాలు, ఇరుగు, పొరుగు సూదుల్లాంటి మాటలతో పొడుస్తారు. కానీ ఇవన్నీ తనకు అనవసరం అనుకున్న ఓ మహిళ... విడాకులు తీసుకోవడమే కాదూ.. దాన్ని కూడా ఓ సెలబ్రేషన్స్‌లా చేసుకుని ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళితే.. సోనియా గుప్తా అనే మహిళకు 2003లో వివాహం చేసుకున్నారు. అనంతరం భర్తతో కలిసి లండన్‌ వెళ్లారు. అక్కడి వెళ్లాక అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. పెళ్లై 17 ఏళ్లు అయినప్పటికీ కూడా వైవాహిక బంధం ఆమెకు సంతృప్తినివ్వలేదు.
ఇక తన భర్తతో కలిసి ఉండలేనని భావించి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం కుటుంబ సభ్యులు చెప్పగానే..తీవ్రంగా ఆమెను దూషించారు. విడాకులకు అంగీకరించలేదు. ఆ సమయంలో సోనియాకు స్నేహితులు అండగా నిలిచారు. ఆమెకు ఓ పరిష్కార మార్గాన్ని చూపించారు. ఏషియన్‌ సింగిల్‌ పేరెంట్‌ నెట్‌వర్క్‌ నుంచి కూడా ఆమెకు మద్దతు లభించింది. మూడేళ్ల సుదీర్ఘ పోరాటం చేయగా... ఎట్టకేలకు విడాకులు వచ్చాయి. విడాకులు తీసుకున్న వెంటనే ' నా 17 ఏళ్ల వైవాహిక బంధం నుండి నాకు విముక్తి లభించింది' అని తెలిపారు. విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా స్నేహితులకు ఓ గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ఆమె ధరించిన డ్రెస్‌పై కూడా ఫైనల్లీ డివోర్స్‌డ్‌ అనే ట్యాగ్‌ కూడా డిజైన్‌ చేయించారు. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీకి చెందిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.