Jul 29,2021 22:31

విద్యార్థుల తల్లిదండ్రులకు నమూనా చెక్కు అందజేస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌

ప్రజాశక్తి-కాకినాడ
జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 1,11,098 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో విడతలో మొత్తం రూ.69.10 కోట్లను జమచేస్తున్నట్లు ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌, జెసి డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలసి సిఎం వైఎస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధి మొత్తానికి సంబంధించిన నమూనా చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విద్య దీవెన పథకం ద్వారా రెండో విడతలో ఎస్‌సి సంక్షేమం కేటగిరీలో 21,300 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.12.59 కోట్లు, ఎస్‌టి సంక్షేమం విభాగంలో 3,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1.55 కోట్లు జమ చేస్తారని చెప్పారు. 48,039 మంది బిసి విద్యార్థులకు రూ.28.48 కోట్ల మేర రెండో విడత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్టు వివరించారు. 9,321 మంది ఇబిసి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.7.60 కోట్లు, 1,326 ముస్లిం మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.87.24 లక్షలు, 26,863 మంది కాపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.17.61 కోట్లు, 521 క్రిస్టియన్‌ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.38.50 లక్షలను జమ చేస్తామని చెప్పారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చదువులు చదివేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, ఎంఎల్‌సి పండుల రవీంద్రబాబు హాజరయ్యారు.