Jun 02,2023 22:41

హిందూపురంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పుస్తకాలు

        హిందూపురం : విద్యాలయాలు వ్యాపార నిలయాలుగా మారాయి. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన చోట వ్యాపార దోపిడీ కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో వారం రోజుల మాత్రమే గడువు ఉండడంతో ప్రయివేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు వారి వ్యాపారానికి తెరలేపాయి. కార్పొరేట్‌ విద్యా సంస్ధలు ఫీజుల రూపంలోనే కాకుండా పుస్తకాలు, యూనిఫారం అమ్ముతూ విద్యార్ధుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. విచ్చలవిడిగా విద్యా సామగ్రిని విక్రయిస్తున్న పాఠశాలలను సూపర్‌మార్కెట్లలా మార్చేశారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.
జూన్‌ ప్రారంభం కాగానే విద్యా సంవత్సరం కూడా ప్రారంభం అయ్యింది. ఇప్పటికే అక్రమ అడ్మిషన్లు, అధిక ఫీజులతో తల్లిదండ్రులను ప్రయివేటు కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోపిడీ చేశాయి. వీటికి తోడు విద్యాసామగ్రిని పాఠశాలల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫీజులు చెల్లించడమే భారంగా మారిన తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్ధలు ఇదొక వ్యాపారంగా చేస్తున్నారు. ఆయా పాఠశాలల పాఠ్య పుస్తకాలు మరో చోట కొనుగోలు చేసే అవకాశం లేదని తమవద్దే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు హుకూం జారీ చేస్తున్నారు. రూ.10 నోటు పుస్తకాన్ని రూ.30కు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కదాని ధరా మూడు నుంచి ఐదింతలు పెంచి అమ్మేస్తున్నారు. యూనిఫాం సైతం బయట దొరకదని తామే స్కూల్‌లో అందిస్తామని చెబుతూ దీని నుంచి కూడా వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. బయట మార్కెట్‌లో పోలిస్తే కార్పొరేట్‌ విద్యా సంస్ధలలో ప్రతి వస్తువునీ 50 శాతానికి పైగా పెంచి విక్రయిస్తున్నారు. తమ పిల్లలను అదే పాఠశాలలో చదివించుకోవాల్సిన నేపథ్యంలో తల్లిదండ్రులు చేసేది లేక వారి చెప్పిన ధరలకు విద్యా సామగ్రిని కొనక తప్పడం లేదు.
ఫీజుల మోత
ప్రతి విద్యా సంవత్సరం కార్పొరేట్‌ విద్యా సంస్ధలు ప్రతి తరగతికీ ఫీజులను పెంచుతున్నారు. ఎల్‌కెజి విద్యకు రూ.20వేలు అయితే రెండవ సంవత్సరం ఎల్‌కెజి వచ్చే సరికి ఈ ఫీజు 20 నుంచి 30 శాతం పెంచేస్తున్నారు. ఏమని అడిగితే మార్కెట్‌లో అన్ని ధరలూ పెరిగిపోతున్నాయని కావున తామూ పెంచుతున్నామంటున్నారు. 10వ తరగతి చదివించడానికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు తల్లిదండ్రులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.
అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం
కార్పొరేట్‌కు దీటుగా ఉండాల్సిన విద్యా సంస్థలు అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వుంది. అధికారులు ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన వసతులన్నింటిని కల్పించాల్సి ఉంది. ఇది చేయకపోవడం వల్ల సరైన సదుపాయాల కల్పన నామమాత్రంగా ఉంటోంది. దీంతో తల్లిదండ్రులు కార్పొరేట్‌ విద్యాలయాలను ఆశ్రయించి లక్షలాది రూపాయలను వారి జేబుల్లోకి వేస్తున్నారు.
సదుపాయాలు లేకుండానే అనుమతులు మంజూరు
ఒక విద్యా సంస్ధను స్ధాపించాలంటే ప్రభుత్వం ఎన్నో నియమ నిబంధనలను ఉన్నాయి. అయితే కార్పొరేట్‌ విద్యాలయాలు స్ధాపించడానికి ఈ ఏ ఒక్క నిబంధనలు పాటించకుండా ఎక్కడబడితే అక్కడ కార్పొరేట్‌ విద్యా సంస్ధలను ఏర్పాటు చేస్తున్నారు. హిందూపురం పట్టణంలో నారాయణ, చైతన్య, చైతన్య ఈ టెక్నో మూడు కార్పొరేట్‌ విద్యా సంస్ధలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క విద్యా సంస్ధ కూడా నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు. కనీసం విద్యార్ధులు ఆటలు ఆడుకోవడానికి కాసింత మైదానం లేదు. ప్రతి సంవత్సరం పాఠశాల వార్షికోత్సవం నిర్వహించుకోవడానికి స్ధలం లేక బయట ఫంక్షన్‌ హాలులో నిర్వహించుకుంటున్నారు. జీవోఎంఎస్‌ నెంబర్‌ ఒకటి ప్రకారం పాఠశాల తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేసి ఫీజులు నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు దీనిని అమలు చేయడం లేదు. ఈ దోపిడీ బాగోతాన్ని విద్యా శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
'కార్పోరేట్‌' పై చర్యలు తీసుకోండి
బాబావలి, ఎస్‌ఫ్‌ఐ జిల్లా కార్యదర్శి.

విద్యను వ్యాపారం చేసి కార్పొరేట్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క ప్రయివేటు విద్యా సంస్థ కూడా నిబంధనలు పాటించడం లేదు. యథేచ్ఛగా పాఠశాలల్లో విద్యా సామగ్రిని విక్రయిస్తున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక ఫీజులు, పుస్తకాల నుంచి యూనిఫాం వరకు లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తాం.