Nov 21,2020 21:24

న్యూఢిల్లీ బ్యూరో: ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు ఐక్యంగా చేపట్టిన ఆందోళనకు ఢిల్లీ యూనివర్శిటీ (డియు) దిగొచ్చింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చింది. స్కాలర్‌ షిప్‌ రాకపోవడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా మస్తాపానికి గురైన ఎల్‌ఎస్‌ఆర్‌ కళాశాల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తెలుగు విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి (19) ఆత్మహత్యతో ''జస్టిస్‌ ఫర్‌ ఐశ్వర్య'' పేరుతో లేడీ శ్రీ రామ్‌ (ఎల్‌ఎస్‌ఆర్‌) కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ నిరంతర ఆందోళనలకు దిగింది. దీంతో, యుజిసి పెండింగ్‌లో ఉన్న ఫెలోషిప్‌లు, స్కాలర్‌ షిప్‌లు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన సమస్యల్లో కొన్నింటి పరిష్కారానికి ఎల్‌ఎస్‌ఆర్‌ కాలేజీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. ఆందోళన చేపట్టినప్పుడు కాలేజి ప్రిన్సిపాల్‌ సుమన్‌ శర్మకు విద్యార్థి సంఘాలు 12 డిమాండ్లతో కూడిన మెమొరాండం సమర్పించాయి. దీనిపై వారంలో యాజమాన్యం కార్యాచరణ మొదలెట్టింది. ఈ వారం రోజుల పాటు ఎస్‌ఎఫ్‌ఐతో పాటు ఇతర విద్యార్థి సంఘాలు తమ ఆందోళనలు కొనసాగిస్తూ వచ్చాయి.
పరిష్కరించిన విద్యార్థి సమస్యలు
కోర్సుల ఫీజులను తగ్గించడం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, టాబ్లెట్‌లు, డేటా ప్యాక్‌లను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాస్టళ్లు ఖాళీ చేయాలనే నోటీసును వెనక్కి తీసుకున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులను హాస్టళ్లలో ఉండేందుకు అనుమతించడం వంటి కొన్ని డిమాండ్లను అంగీకరించినట్లు కళాశాల అధికారులు ప్రకటించారు. కళాశాల వెబ్‌సైట్‌లో ''నెరవేర్చిన విద్యార్థుల డిమాండ్లకు ప్రతిస్పందన'' అనే పత్రాన్ని అప్‌లోడ్‌ చేసింది. ''విద్యార్థులు క్యాంపస్‌లో లేనందున కళాశాల అందించే కొన్ని సౌకర్యాలను పొందలేకపోతున్నందున, కళాశాల అటువంటి వాటికి సంబంధించిన ఫీజులను మినహాయిస్తున్నాం. ఇది ఫీజులను గణనీయంగా తగ్గించటానికి దారితీసింది. అదనంగా ఫీజును వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించింది'' అని పేర్కొంది. సవరించిన ఫీజు నోటీసులో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం అన్ని కోర్సులకు వార్షిక రుసుము ఇప్పుడు రూ.7,970గా ఉంటుందని పేర్కొంది.
పోరాటాన్ని కొనసాగిస్తాం : ఉన్నిమయా
ఇది పాక్షిక విజయమేనని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎల్‌ఎస్‌ఆర్‌ కాలేజీ స్టూడెంట్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉన్నిమయా స్పష్టం చేశారు. ''ఫీజు సవరించినప్పటికీ, ఇతర ఛార్జీలు మాఫీ చేసినట్లు పారదర్శకంగా లేదు. కళాశాల అధికారులు దానిపై స్పష్టం చేయాలి'' అని అన్నారు. తమ పోరాటానికి యాజమాన్యం దిగిరావడం విద్యార్థుల సమస్యల కోసం పోరాడటానికి విప్లవాత్మక స్ఫూర్తిని ప్రేరేపిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మౌనిక శ్రీ చెప్పారు. విద్యార్థి సంఘాల ఐక్య ఉద్యమ బలాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇంకా చాలా డిమాండ్లు సాధించాల్సి ఉందని, పోరాటం కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు.

delhi iniversity