Dec 02,2021 07:06

రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలను ముందుకు తీసుకుపో వాలంటూ విద్యార్థి లోకానికి కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి ఇచ్చిన పిలుపు ఆహ్వానించదగింది. ఎస్‌ఎఫ్‌ఐ 23వ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా విజయనగరంలో జరిగిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ పిలుపునిచ్చారు. విద్యార్థులు చైతన్యానికి మారుపేరు. వేల ఆలోచనలు, భావాల ఘర్షణతో జాతి భవితకు బాటలు వేస్తారు. అయితే, ఇదంతా గతం! దేశంలో అమలులోకి వచ్చిన సరళీకరణ ఆర్థిక విధానాలు విద్యార్థులలో అత్యధికులను కూపస్థ మండూకాలుగా మార్చివేశాయి. ఈ పరిస్థితి మారి మళ్లీ గత వైభవాన్ని, పోరాట దీప్తిని విద్యార్థిలోకం సంతరించుకోవాలన్నది అభ్యుదయ కాముకులందరి ఆకాంక్ష! నిజానికి దేశ స్వాతంత్య్ర సమరంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. జలియన్‌వాలాబాగ్‌ దురంతం అనంతరం విద్యాసంస్థలు పోరాట స్ఫూర్తితో రగిలాయి. జాతీయోద్యమం సైతం విద్యార్థులను స్వతంత్ర సంగ్రామంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్ర అనిర్వచనీయం. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల వంటి ఎందరో పోరాట యోధులను విద్యార్థి లోకం దేశ ప్రజలకు ఆర్పించింది.

స్వాతంత్య్రానంతరం కూడా విద్యార్థిలోకం ఇటువంటి చైతన్యవంతమైన పాత్రనే పోషించింది. కులవివక్ష, వరకట్నం, మహిళా సమస్యలు, అవినీతి, ఆర్థిక అసమానతలపై గళం విప్పింది. విద్యార్థుల చొరవతో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అర్ధవంతమైన చర్చలకు, ప్రజాస్వామ్య ప్రక్రియకు వేదికలుగా మారాయి. జాతి రత్నాలుగా ఖ్యాతి గాంచిన ఎందరో మేథావులను, దేశం గర్వించదగ్గ నేతలను విద్యాసంస్థల్లో విరాజిల్లిన ఈ ప్రజాతంత్ర వాతావరణమే అందించింది. ఇక్కడ సాగిన మేథోమథనం నుండే తొలితరం, మలితరం జాతీయ నాయకుల మస్తిష్కాలు వికసించాయి. అనంతర కాలంలో దేశాభివృద్ధికి తమ వంతు పాత్రను వారు పోషించారు. మన రాష్ట్రంలోనూ విద్యార్థిలోకం ఇటువంటి పాత్రనే పోషించింది. విశాఖ ఉక్కును సాధించేంత వరకు ఉద్యమించింది. ఎక్కడికక్కడ సాగిన ప్రజాతంత్ర, సామాజిక ఉద్యమాల్లో విద్యార్థులు గణనీయమైన పాత్ర పోషించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగానూ మంత్రులుగానూ బాధ్యతలు నిర్వహించిన వారిలో అనేకులు ఈ పోరాటాల నుండి ఉద్భవించినవారే!

అయితే, 90వ దశకంలో ప్రారంభమైన సరళీకరణ ఆర్థిక విధానాలు, వాటితో పాటే ప్రారంభమైన విద్యారంగ సంస్కరణలు పరిస్థితిని మార్చివేశాయి. మేథోవికాసం కన్నా, బట్టీ పట్టే చదువుకు, ర్యాంకుల సాధనకు విద్యార్థులను పరిమితం చేశాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్య విస్తరణతో తరగతి గదులు ర్యాంకర్లను తయారు చేసే కర్మాగారాలుగా మారాయి. ఖర్చుకు వెనకాడకుండా చదువును కొనిస్తున్నామని తల్లిదండ్రులు మురిసిపోయారుగానీ, తమ పిల్లలను తమ చేతుల మీదగానే కార్పొరేట్‌ సరుకులుగా మారుస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఫలితం దేశానికి చోదక శక్తులుగా ఉండాల్సిన యువతరం నీరుగారింది. నవ శక్తులు నిర్వీర్యమయ్యాయి. సొంత లాభం తప్ప మరేమి అవసరం లేదన్న కార్పొరేట్‌ సంస్కృతి మెదళ్లలోకి ఇంకిపోవడతో సమాజంలో జరిగే అన్యాయాలకు, అక్రమాలకు స్పందించడం తగ్గింది. మరోవైపు మత విద్వేష రాజకీయాలతో చిచ్చు రాజేసే సమిధులుగా ఒక సెక్షన్‌ విద్యార్థులు తయారవడం ఆందోళనకర స్థాయికి చేరింది. హిందూత్వ, కార్పొరేట్‌ దోపిడి విధానాల విష సమ్మేళనం దేశాన్ని, దానితో పాటు విద్యా వ్యవస్థను అథోగతికి తెచ్చింది. ఆదర్శాలు, ఉద్యమ స్ఫూర్తి అడుగంటాయి. కళాశాలల్లో మాదకద్రవ్యాల విచ్చలవిడి వాడకం భావి పౌరుల్ని మత్తులో ఉంచుతోంది. బహుశా, అందుకనే ఉవ్వెత్తున సాగుతున్న రైతాంగ ఉద్యమంలో గానీ, విభజన అనంతరం రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జరిగిన పోరాటంలోగానీ విద్యార్థుల పాత్ర పరిమితంగానే ఉంటోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కదలిక స్వల్పమే!! ఈ పరిస్థితి మారాలి. విద్యారంగ పరిరక్షణతో పాటు, సమాజ పురోగతికి బాటలు వేసే పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలి. విజయనగరంలో జరిగిన సభ ఇచ్చిన స్ఫూర్తితో ఎస్‌.ఎఫ్‌.ఐ వంటి విద్యార్థి సంఘాలు ఆ దిశలో నడిచి మొత్తం విద్యార్థి ఉద్యమాన్ని లౌకిక, ప్రజాస్వామ్య సాంప్రదాయాల దిశగా, సమైక్యంగా నడిపిస్తాయని ఆశిద్దాం.