
ప్రజాశక్తి-సబ్బవరం : విద్యార్థులు మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్ అన్నారు. మండలంలోని స్థానిక సన్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను గురువారం ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వినయంతో విద్య రాణిస్తుందని, విద్యావంతుని ప్రపంచం గౌరవిస్తుందని చెప్పారు. సమాజానికి గురువులు దిక్సూచీ లాంటివారని, గురువులను గౌరవించినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎన్. నేహ సంజనకు రూ.25వేలు, ఎస్.నిహారికకు రూ.10వేలు, కె.వైష్ణవికి రూ.10వేలు నగదు బహుమతులను అందజేశారు. స్కూల్ కరెస్పాండంట్ ఎన్.సత్తిరెడ్డి మాట్లాడుతూ ఇకపై 10/10 మార్కులు సాధించిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేడ్డెం ప్రసాదరావు, మండల వైసీపీ అధ్యక్షులు కర్రి బాబు, లక్కీ అమర్ స్కూల్ డైరెక్టర్ డి.వాసుదేవ్, స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.