
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : విద్యతోనే పేదరికాన్ని రూపుమాపవచ్చని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విద్యా దీవెన పథకం కింద జులై-సెప్టెంబరు త్రైమాసికం నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ పిల్లలను పనిలోకి కాకుండా పాఠశాలలకు పంపే విధంగా తల్లులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. చదువుతో పాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో విద్యా దీవెన ద్వారా 57,753 విద్యార్థులకు గానూ 51,725 మంది తల్లుల ఖాతాలో రూ.29.73 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ గడ్డెమ్మ, సంక్షేమ శాఖాధికారి ఇ.అనురాధ తదితరులు పాల్గొన్నారు.