Mar 25,2023 00:07

బ్రహ్మానందరావు, దేవేందర్‌ మృతదేహాలు

ప్రజాశక్తి - కారెంపూడి, వినుకొండ : విద్యుద్ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన కారెంపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మిన బ్రహ్మానందరావు (62) పశువుల కొట్టంలోని ఇనప గర్రును తీస్తుండగా అతి తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వారు మండిపడ్డారు. ఇంటి పెద్ద మృతితో అతని కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
మిరప కోతకు వెళ్లి వస్తున్న సమయంలో పిడుగు పడి వలసకూలీ మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం సరికొండపాలెంతండా వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా సాతునూరికు చెందిన దేవేందర్‌ (30), కూలీలతో కలిసి మిరపకోతకు వెళ్లి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసి పిడుగు పడడంతో దేవేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు జిల్లా నుంచి సుమారు 150 మంది వెల్లటూరు ప్రాంతానికి మిర్చి కోతల కోసం కొన్నాళ్ల కిందట వలసొచ్చారు. మృతుడు దేవేందర్‌కు ఇద్దరు కుమారులు కాగా భార్య 8వ నెల గర్భవతి.