Oct 09,2020 10:18
విద్యుత్‌ ప్రయివేటీకరణపై త్రిపురలో భగ్గుమన్న కార్మికులు

అగర్తలా : విద్యుత్‌ బోర్డు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ త్రిపురలో సీఐటీయూ కార్యకర్తలు చేపట్టిన భారీ నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.  గురువారం  నగరంలోని పలు కూడళ్లలో నిరసనకారులు ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. అగర్తలా నగరంలోని పలు చోట్ల నుంచి బ్యానర్లు చేతబూని, నినాదాలు చేస్తూ... కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ పాలకులు అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలు అమలైతే కార్మికుల బతుకులు ఆగమవుతాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విప్లవ్‌దేవ్‌ సీఎం అయ్యాక.. కార్మికులపై కక్షసాధింపు చర్యలు అధికమయ్యాయని వారు విమర్శించారు. ఊహించని విధంగా కార్మికులు తరలిరావటంతో ర్యాలీని అడ్డుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలని రంగంలోకి దించింది. అయినా వెనుకడుగువేయని కార్మికులంతా ముందుకు కదం తొక్కారు. దీంతో పోలీసులు బలప్రయోగానికి దిగారు. ముందుగా బారికేడ్లతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. హక్కుల సాధనకు పిడికిలి బిగించి ముందడుగు వేశారు. ముందుగా నిరసనకారులపై వాటర్‌కెనాన్లు ప్రయోగించారు. నిరసన ర్యాలీ శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. పోలీసుల దుందుడుకు గా వ్యవహరించి లాఠీచార్జీకి దిగటం వివా దాస్పదమైంది. మోడీ సర్కార్‌ కు వ్యతిరేకంగా యూపీలో 15లక్షల మంది విద్యుత్‌ కార్మికులు రోడ్డెక్కారు. విద్యుత్‌ ప్రయివేటీకరణకు అనుమతిస్తే.. వెనక్కితగ్గమని కార్మికులు హెచ్చరిక చేశాక.. యోగి సర్కార్‌ బ్యాక్‌ ఫుట్‌ వేసింది. ఇపుడు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన త్రిపురలోనూ విద్యుత్‌ ప్రయివేటీకరణ వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సీఐటీయూ చేపట్టిన ఆందోళనకు ప్రజలు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు. కాగా పోలీసులు విరుచుపడటంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.