
ప్రజాశక్తి-మార్టూరు రూరల్: దీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటీయు జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు డిమాండ్ చేశారు. బుధవారం మార్టూరు ఎడిఎ కార్యాలయం వద్ద మండల పరిధిలోని వలపర్ల గ్రామ విద్యుత్ వినియోగదారులు తమ గ్రామంలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల హనుమంతరావు మాట్లాడుతూ.. వలపర్లలో ప్రజలకు వస్తున్న కరెంటు బిల్లులు చూసి సామాన్యులు షాక్కు గురవుతున్నారని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా గ్రామంలో మీటర్లకు రీడింగ్ సరిగా తీయకపోవడం, విద్యుత్ బిల్లులు పెద్ద మొత్తంలో రావడం, కరెంటు బిల్లులు చెల్లిస్తామని నగదు వసూలు చేసిన కొంతమంది సిబ్బంది సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఒకేసారి పెద్దమొత్తంలో అరియర్స్ రావడం వంటి సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమని అన్నారు. వలపర్ల హైస్కూల్ సమీపంలో కుట్టు మిషన్తో బట్టలు కుట్టుకుంటూ చిన్న ఇంట్లో నివాసముంటున్న మహ్మద్ షరీఫ్ అనే సాధారణ వ్యక్తికి ఒక్కసారిగా రూ.83,105 కరెంటు బిల్లు రావడంతో ఆయనకు గుండె ఆగినంత పనయ్యిందని పేర్కొన్నారు. ఎవరికి చెప్పుకుంటే తన సమస్య పరిష్కారమవుతుందో తెలియక అంత బిల్లు చెల్లించలేక భయాందోళనకు గురవుతున్నాడని అన్నారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్మెన్ విధుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్లె వలపర్ల గ్రామంలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయని, వెంటనే సదరు అసిస్టెంట్ లైన్మెన్ని వలపర్ల గ్రామ విధుల నుంచి తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని బత్తుల హనుమంతరావు డిమాండ్ చేశారు. అనంతరం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగారపు గురవయ్యకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.
వెంటనే పరిష్కరిస్తాం: ఎన్ గురవయ్య, డిప్యూటీ ఈఈ
వలపర్ల గ్రామంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారంలో చర్యలు తీసుకుంటాము. పాత మీటర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేస్తాము. విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.