Feb 21,2021 12:35

ఒకప్పుడు అవతలి వ్యక్తితో మాట్లాడాలంటే ఫోన్‌కాల్‌ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు వీడియోకాల్‌ చేస్తున్నాం. పక్కనే ఉన్నట్లుగా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇక కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఒకరిని మరొకరు నేరుగా కలవలేని పరిస్థితి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవాళ్లు కూడా పెరిగారు. ఈ క్రమంలోనే వీడియో కాల్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే వీడియో కాల్స్‌ వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతోందని మనలో ఎంతమందికి తెలుసు? వీడియోలు హైక్వాలిటీలో ఎక్కువగా చూడడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందట! నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. ఇది వాస్తవం.


టెక్నాలజీ మిగిల్చిన దుష్ప్రభావాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. గ్యాడ్జెట్లు, ఇతర డివైజ్‌లను వాడేటప్పుడు మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే ప్రకృతికి ఎంతోకొంత మేలు చేస్తాయని చెబుతున్నారు. వర్చువల్‌ మీటింగ్స్‌లో పాల్గొనేవారు కెమెరాను ఆపేయడం వల్ల కార్బన్‌ ఉద్గారాలను చాలావరకూ తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. వెబ్‌ కాల్స్‌, మీటింగ్స్‌లో పాల్గొనేవారు కెమెరాను స్విచ్‌ఆఫ్‌ చేయడం వల్ల.. ఒక వ్యక్తి ద్వారా విడుదలయ్యే కార్బన్‌ ఉద్గారాలను 96 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని పుర్డ్యూ యూనివర్సిటీకి (ూబతీసబవ ఖఅఱఙవతీరఱ్‌y) చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనాన్ని 'రిసోర్సెస్‌, కన్జర్వేషన్‌ అండ్‌ రీసైక్లింగ్‌' (=వరశీబతీషవర, జశీఅరవతీఙa్‌ఱశీఅ aఅస =వషyషశ్రీఱఅస్త్ర) జర్నల్‌లో ప్రచురించారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి స్ట్రీమింగ్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు హై డెఫినెషన్‌లో కాకుండా స్టాండర్డ్‌ డెఫినెషన్‌లో కంటెంట్‌ను చూడటం వల్ల కూడా కార్బన్‌ ఉద్గారాలను 86 శాతం వరకు తగ్గించవచ్చని చెప్పారు.


ఇంటర్నెట్‌ వినియోగం పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై ఈ పరిశోధనలు చేశారు. ఒక గిగాబైట్‌ డేటా కోసం ఎంత మొత్తంలో కార్బన్‌, నీరు, భూమి అవసరమవుతాయనే వివరాలను పరిశోధకులు గుర్తించారు. ఇందుకు యూట్యూబ్‌, జూమ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, టిక్‌టాక్‌ వంటి 12 ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వంటి ఇతర వెబ్‌ సర్ఫింగ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో ఉపయోగించిన ప్రతి గిగాబైట్‌ డేటా ఆధారంగా కాలుష్యాన్ని అంచనా వేశారు. ఏదైనా ఒక యాప్‌లో వీడియోలను ఎక్కువగా చూసినప్పుడు కార్బన్‌ వాయువులు ఎక్కువగా విడుదలవుతున్నాయని అధ్యయన బృందం గుర్తించింది. కోవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌కు ముందే ఇంటర్నెట్‌ వాడకం వల్ల కార్బన్‌ ఉద్గారాల కాలుష్యం పెరిగినట్లు గుర్తించారు. లాక్‌డౌన్‌కు ముందు ప్రపంచ గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలలో ఇంటర్నెట్‌ వాటా 3.7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.


వెబ్‌ ప్లాట్‌ఫాంలను, వాటిని వాడుతున్న దేశాలను బట్టి కాలుష్య ఉద్గారాలు మారుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం బ్రెజిల్‌, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇరాన్‌, జపాన్‌, మెక్సికో, పాకిస్థాన్‌, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, అమెరికా దేశాల నుంచి డేటాను సేకరించారు. ప్రపంచ సగటుతో పోలిస్తే అమెరికాలో ఇంటర్నెట్‌ డేటాను ప్రాసెస్‌ చేయడానికి, ప్రసారం చేయడానికి తొమ్మిది శాతం ఎక్కువ కార్బన్‌ ఉద్గారాలు విడుదలవుతున్నాయని గుర్తించారు. కానీ ఇందుకు అవసరమయ్యే నీటి వినియోగం 45 శాతం, భూమి వినియోగం 58 శాతం తక్కువగా ఉన్నాయని తెలిపారు.