Oct 18,2020 23:03

ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న ప్రజలు

ప్రజాశక్తి - వీరఘట్టం: మా సామాజిక తరగతికి చెందిన వ్యక్తిని చంపేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ గ్రూపు పోలీస్‌ స్టేషన్‌ వద్ద మృతదేహంతో ఆందోళనకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న మరో గ్రూపు ఆ వ్యక్తి చావుతో తమకు సంబంధం లేదని, అది సహజ మరణమని రాస్తారోకో, ధర్నా చేపట్టారు. పోలీసులు కలుగజేసుకొని ఆందోళన విరమించాలని కోరినా వినలేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బాబు జగ్జీవన్‌రామ్‌ కాలనీలోని ప్రభుత్వస్థలంలో హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి జెసిబితో మట్టిని తవ్వుతున్నారు. డ్రైవరు ఉత్తరావల్లి సత్యనారాయణ ఓ ఇంటి ముందు ఉన్న కర్రలను జెసిబితో పక్కకు తీయడంతో ప్రేమభూషణరావు గ్రూపుకు చెందిన నానిబాబు, ఎస్‌.రమేష్‌ డ్రైవరుపై ఆగ్రహం వ్యక్తం చేసి, దాడి చేశారు. ఈ కొట్లాటను అక్కడ ఉన్న వేణుగోపాలరావు అడ్డుకున్నాడు. అరుపులు, కేసులు విన్న కళింగ పోలిరాజు(43) ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చాడు. ఆయన భార్య మరియ, కుమారుడు మనకెందుకు గొడవలని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక పోలిరాజు స్పృహ కోల్పోయాడు. భార్య మరియమ్మ సపర్యలు చేసింది. అనంతరం కుటుంబసభ్యులు 108 సహాయంతో వీరఘట్టం పిహెచ్‌సికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ప్రేమభూషణరావు, వేణుగోపాలరావుకు పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలిరాజు మృతి విషయం తెలుసుకున్న ప్రేమభూషణరావు పాలకొండ నుంచి వీరఘట్టం చేరుకున్నాడు. తన గ్రూపుతో ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వేణుగోపాలరావుపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వేణుగోపాలరావు గ్రూపు అది సహజ మరణమని, ఆ మృతితో తమకు సంబంధం లేదని చెప్పారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య గొడవ పెరగడంతో వేణుగోపాలరావు గ్రూపు ధర్నా, రాస్తారోకో చేపట్టింది. పాలకొండ సిఐ ఆదాం, ట్రయినీ డిఎస్‌పి శ్రీలత వారితో చర్చించినా వినలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌పి అమిత్‌ బర్దార్‌, ఆర్‌డిఒ పివివిజిఎస్‌.కుమార్‌ స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇరుగ్రూపులతో మాట్లాడతానని ఎస్‌పి అన్నారు. పోస్టుమార్టం రిపోరు సోమవారం రానుంది. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.