
హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ జంటగా 'మహానటి' సినిమాలో నటించి మెప్పించారు. తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి 'ఖుషీ' సినిమాలో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్రయూనిట్ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో.. 'ఒక గోడపై విజరు, సమంత కూర్చుని ఉన్నారు. విజయ్ వైపు సమంత నవ్వుతూ కనిపిస్తోంది. సమంత పింక్ కలరీ శారీ.. వెనుక బ్యాక్‌గ్రౌండ్ మంచుకొండలు, కొంగుముడులు ముడివేయడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ జంట తెరపై మరోసారి విశేషంగా ఆకట్టుకోనుందని ఫస్ట్‌లుక్‌ని చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. గతంలో నాని హీరోగా 'టక్ జగదీష్' చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆలరించకపోయింది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
కాగా, విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సమంత పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న 'యశోద' మూవీలో నటిస్తోంది.
