Sep 14,2021 20:39

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ : గత రెండేళ్లలో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖకు చెందిన బృందం విజయనగరం జిల్లాలో మంగళవారం పర్యటించింది. పార్వతీపురం మండలం నర్సిపురం పంచాయతీ కారాడవలస పరిధిలోని ఈదరబందలో జరిగిన పనుల గురించి క్షేత్ర సహాయకులను, మేట్‌లను బృందం సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెదబండపల్లి తామరచెరువు గట్టుపై దిబ్బగుడివలస, గదబవలస, పెదబండపల్లికి చెందిన వేతనదారులతో సమావేశం నిర్వహించారు. వారి ఆర్థిక స్థితిగతులు, పనులు, వేతనదారుల ఆదాయం, పనిదినాలు, ఉపాధి సిబ్బంది సమకూర్చిన సౌకర్యాలపై ఆరా తీశారు. విశ్వంబరపురానికి చెందిన రైతు పోల బాలకోటేశ్వరరావు ఉపాధి పథకంలో భాగంగా తన ఐదెకరాల భూమిలో వేసిన జీడి, మామిడి పెంపకం గురించి వివరించారు. అనంతరం సాలూరులోని గిరిజన గర్భిణుల వసతిగృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లాలో గతేడాది నుంచి చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించేందుకు బృందం వచ్చిందన్నారు. గ్రామ సచివాలయాలు, పథకాల అమలు, నిత్యావసర సరకులు ఇంటింటికీ అందజేస్తున్న వాహనాలను పరిశీలించి బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు రూరల్‌ డెవలప్మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అమరేంద్ర ప్రతాప్‌ సింగ్‌, జాయింట్‌ సెక్రటరీ రోహిత్‌ కుమార్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ హాన్సిల్‌కుమార్‌, పిఆర్‌ అండ్‌ అర్‌డి కమిషనర్‌ గిరిజాశంకర్‌, స్పెషల్‌ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.