Jan 13,2021 11:44

విజయవాడ : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. బుధవారం విజయవాడ బెంజిసర్కిల్‌ లో వివిధ మహిళా సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా నిరసన చేపట్టాయి. రైతు సంఘాల పిలుపు మేరకు.. భోగి మంటలను వేసి ఆ మంటల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. జనవరి 26 న ఢిల్లీలో నిర్వహించనున్న రైతు కవాతుకు పెద్ద ఎత్తున ప్రజలంతా మద్దతు పలకాలని, రైతులకు అండగా నిలబడాలంటూ భోగి మంటల సాక్షిగా నేతలు పిలుపునిచ్చారు.

భోగి మంటలు వేసుకొని సంబరాలు చేసుకోవాల్సింది రైతులు కానీ ఈరోజున రైతన్నల గుండెలు మండుతోన్నాయి : మహిళా సంఘాలు
    మహిళా సంఘం నాయకురాలు మాట్లాడుతూ.. ఏ రైతులయితే దేశానికి అన్నం పెడుతున్నారో.. ఆ రైతులను రోడ్డుపాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను తెచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ఈరోజు కొనసాగుతోన్నాయన్నారు. రైతన్నలను కార్పొరేట్‌ కు తాకట్టు పెట్టే ప్రయత్నం మోడి చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని చలిలో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటూ అన్నదాతలంతా ఉద్యమిస్తుంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేరా ప్రధాని మోడీ.. అని ప్రశ్నించారు. రైతన్నల గెలుపే.. మహిళల గెలుపుగా భావించి ఈరోజు పెద్దఎత్తున భోగి మంటల నిరసన చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఈ మంటల్లో తగలబెట్టామన్నారు. భోగి మంటలు వేసుకొని సంబరాలు చేసుకోవాల్సింది రైతులు కానీ ఈరోజున రైతన్నల గుండెలు మండుతోన్నాయని ఆవేదన వ్యక్తపరిచారు.

జాతీయ జెండాలతో ఈనెల 26 న పేరేడ్‌ లను చేపడతాం : రైతు సంఘ నాయకులు కేశవరావు
      రైతు నాయకులు కేశవరావు మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో రైతుల పంటలకు కంపెనీలు నిర్ణయించే రేటు మాత్రమే తప్ప మద్దతు ధర లేదని అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లన్నీ ఉపసంహరించి.. ఎక్కడో రైతు తన పంటను అమ్ముకోవడానికి స్వేచ్ఛనిచ్చామని చెప్పి కార్పొరేట్‌ దయాదాక్షిణ్యాలపై వదిలినట్లు ఉందని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. దేశంలోని ప్రజల ఆహార అవసరాలను కూడా గాలికొదిలేసి, కార్పొరేట్‌ కంపెనీలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేసి పంటను దిగుమతి చేసుకోవడానికి కంపెనీలకు కేంద్రం అవకాశమిచ్చిందని, దీనివల్ల ఆహార భద్రతకు కూడా ముప్పొస్తుందని కేశవరావు ఆందోళన వ్యక్తపరిచారు. ఆ చట్టాలను పక్కన పెడుతున్నామని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ.. అది వేసిన కమిటీలో ఆ చట్టాలను తయారు చేసిన నిపుణులనే పెట్టారు కాబట్టి అందువల్ల ఆ నిపుణులతో చర్చించే సమస్య లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకూ ఈ పోరాటం ఆగదని కేశవరావు ఉద్ఘాటించారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో 5 లక్షలమంది రైతాంగం ఉన్నారని, లక్ష ట్రాక్టర్లు అక్కడ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈనెల 26 న రైతాంగమంతా ఢిల్లీలో ప్రవేశించి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పేరేడ్‌లను నిర్వహిస్తామని ప్రకటించారు. '' మేము దేశభక్తులమే '' నని రుజువు చేస్తూ జాతీయ జెండాలతో ఆ రోజు పేరేడ్‌ లను చేపడతామని కేశవరావు పేర్కొన్నారు.
kesavarao