Jul 29,2021 19:23

ఏ విద్యలోనైనా విజయం రాణించాలంటే గురువు లేనిదే సాధ్యపడదు. అందులోనూ చిత్రలేఖనంలో ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునేలా బొమ్మగీయడం అంటే గురువు సూచనలు - సలహాలు చాలా ముఖ్యం. అలాంటిది ఇవేమి లేకుండా యశ్వంత్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తను చిత్రాలను కుంచెతో పాటు శరీర అవయవాలతో గీస్తూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రకరకాలుగా బొమ్మలు గీయడంలో తన ప్రతిభను కనబరిచి పన్నెండు ప్రపంచస్థాయి రికార్డులు సాధించాడు.

pic 2

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యశ్వంత్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి. వడ్లమూడి విజ్ఞాన్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. యశ్వంత్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి సైన్సు సబ్జెక్టుకు సంబంధించిన ఒక బొమ్మను గీశాడు. అది బాగా కుదరలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి గీసిన బొమ్మను ఉపాధ్యాయుడికి చూపించాడు. అది చూసిన ఆయన బాగా మెచ్చుకున్నాడు. స్కూలు స్థాయిలో తనకి మంచి గుర్తింపు వచ్చింది. పిల్లల చప్పట్లు, స్నేహితుల పొగడ్తలు... యశ్వంత్‌కి సంతోషంతో పాటు బలాన్ని చేకూర్చాయి. అవే అతన్ని చిత్రలేఖనంలో ముందుకు నడిపించాయి. వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిత్రలేఖనంలో సాధన చేయడం ప్రారంభించాడు. అతని బొమ్మలను చూసి పక్కింటి జాహ్నవి అక్క అతనికి సూచనలు చేసేది. బొమ్మ ఎలా ఉందో చెప్పేది. ఆమె సలహాలతో ఆర్ట్‌ కళపై దృష్టి పెట్టాడు.
బొమ్మని గానీ, వ్యక్తిని గానీ ఒకసారి తదేకంగా చూస్తే చాలు... గంటల నుంచి నిమిషాలకు, నిమిషాల నుంచి సెకన్లలో గీసే విధంగా సాధన చేశాడు. మొదటిగా రెండు చేతులు, రెండు కాళ్ళతో అమితాబ్‌ బచ్చన్‌ బొమ్మ వేశాడు. యశ్వంత్‌ ప్రతిభను ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడంతో పాటు వివిధ పాఠశాల, కాలేజీ స్థాయి పోటీల్లో బహుమతులు అతని సొంతం అయ్యాయి. దాంతో ఆర్ట్‌ తన దినసరి అలవాటుగా మారిపోయింది.

pic 4

ఇంటర్‌ చదువుతున్నప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి చిత్రాలను నిలువుగా కాకుండా కింది నుంచి పైకి, తిరిగదిప్పి వేయడం నేర్చుకున్నాడు. రంగస్థలం సినిమా ఆడియో లాంచ్‌ ఫంక్షన్‌ తెనాలిలో నిర్వహించినప్పుడు పోస్టర్‌ ఆధారంగా హీరో రామ్‌ చరణ్‌ బొమ్మ వేశాడు. సైరా సినిమా విడుదలకు ముందు గుంటూరులో పోస్టర్‌లో ఉన్నట్లుగానే చిరంజీవి బొమ్మ గీశాడు. కొబ్బరాకుతో పవన్‌ కళ్యాణ్‌ బొమ్మ గీశాడు. ఇలా రకరకాల ప్రయోగాలతో వందల కొద్ది బొమ్మలు గీశాడు. బొమ్మ గీయాలంటే సునిశిత పరిశీలన, ఏకాగ్రత కావాలి. యశ్వంత్‌ మాత్రం ఎప్పుడైనా ఒత్తిడికి గురైనా, ఆందోళన చెందినా వెంటనే బొమ్మలు గీయడం మొదలెడతాడు. దాంతో తన మనసు స్థిమిత పడుతుంది. ఆయిల్‌ పెయింటింగ్‌, వాటర్‌ పెయింటింగ్‌, లైన్‌, డాట్‌, మోడ్రన్‌, ఆర్కిలిక్‌, అబ్‌స్ట్రాక్‌, పొట్రేట్‌, పెన్సిల్‌, హైపర్‌ రియలిస్టిక్‌ .. ఇలా రకరకాల పద్ధతుల్లో యశ్వంత్‌ చిత్ర యాత్ర సాగుతోంది.
సోనూసూద్‌ బొమ్మతో గుర్తింపు
ఇటీవల యశ్వంత్‌ తెనాలిలో 2938 అడుగుల సోనూ సూద్‌ బొమ్మను ఇసుకలో రంగులు కలిపి గంటా 4:57 నిమిషాల్లో రూపొందించాడు. దీనికి 12 అంతర్జాతీయ అవార్డులతో పాటు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ముక్కుతో, నాలుకతో, నోటితో అతడు బొమ్మలు గీయగలడు. లాక్‌డౌన్‌లో దొరికిన ఖాళీ సమయంలో దీనిపై దృష్టి పెట్టి మరింత సాధన చేశాడు. దీంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో గుర్తింపు వచ్చింది.
యశ్వంత్‌ స్వగ్రామం పెరవలిపాలెం అయినా యశ్వంత్‌ ఇంజినీరింగ్‌ చదువు కోసం కుటుంబం మొత్తం తెనాలి వచ్చి ఉంటున్నారు. తల్లి గృహిణి, తండ్రి దాసరి శ్రీనివాసరావు మెమెరి ట్రైనర్‌, సైకాలజిస్ట్‌. తనకు తెలిసిన విద్యను చిన్నపిల్లలకు, తోటి విద్యార్థులు ఇంటి దగ్గర 200 మందికి పైగా ఉచితంగా బొమ్మలు వేయడం నేర్పించాడు. సామాజిక ఇతివృత్తాలను దృష్టిలో పెట్టుకొని బొమ్మలు గీయడం అంటే యశ్వంత్‌కి చాలా ఇష్టం. భవిష్యత్తులో వినూత్నమైన మరిన్ని బొమ్మలు గీచి, ప్రపంచానికి చూపాలని ఇప్పుడు నిరంతర సాధన చేస్తున్నాడు.
- ఖాజా మహ్మద్‌, పొన్నూరు