Jun 01,2023 23:25

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, ధవళేశ్వరం
ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సాగుకు పిలుపునిచ్చిందని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ డెల్టా కాలువలకు వారు నీటిని విడుదల చేశారు. తొలుత గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్‌ చేసి గేట్లను పైకిలేపి దిగువకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడారు. ప్రస్తుతం మూడు డెల్టాలకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. గతేడాది ముందుస్తు సాగును చేపట్టడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. ఇదే తరహాలో ఈ ఏడాదీ ముందస్తు సాగుకోసం నీటిని విడుదల చేశామన తెలిపారు. ముఖ్యమంత్రి రైతుల కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నాటి పాలకులు రూ.86,500 కోట్ల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసాగా రూ.30,600 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమన్నారు. జగన్‌ అధికారంలోకొచ్చిన నాటి నుంచి అన్ని రిజర్వాయర్లు నీటితో కలకలలాడుతున్నాయన్నారు.
హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగా చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ముందుస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల సకాలంలో విత్తనాలు వేసేందుకు రైతులకు ఆస్కారం ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్‌బికెల ద్వారా రైతులకు సాంకేతికపరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సిఎం జగన్‌ ముందుచూపు వల్లే సకాలంలో సాగునీరు అందించడం సాధ్యమైందన్నారు. ఎంపీ భరత్‌ మాట్లాడుతూ ఎంపీ భరత మాట్లాడుతూ రైతుల సమస్యలు, వారి కష్టాలు పూర్తిగా తెలిసిన నేత సిఎం జగన్‌ అన్నారు. రైతాంగానికి అన్ని విధాలా సిఎం జగన్‌ అండగా ఉన్నారన్నారు. కలెక్టరు కె.మాధవీలత మాట్లాడుతూ ముందస్తు సాగుకోసం ఇప్పటికే ఇరిగేషన్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన సమన్వయకమిటీలను వేశామన్నారు. నీటి విడుదలకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేశామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత మంత్రులు కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, ఇరిగేషన్‌ సిఇ ఆర్‌.సతీష్‌కుమార్‌, ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యులు కె.తేజ, స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాలువలకు నీరు విడుదల
ఆత్రేయపురం జిల్లాలోని డెల్టా కాలువలకు సాగునీటిని గురువారం విడుదల చేశారు తొలుతగా ధవలేశ్వరం వైపున తూర్పు డెల్టా కాలువకు బొబ్బర్లంక వద్ద మధ్య డెల్టా కాలువకు పశ్చిమ డెల్టాకు సంబంధించి విజ్జేశ్వరం వద్ద ప్రధాన కాలువలకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్‌ ఎఇ పిల్ల సత్యనారాయణ గోదావరి ప్రత్యేక పూజలు చేసిఅనంతరం సంబంధిత అధికారులు స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బర్లంక వద్ద మధ్య డెల్టా కు 50 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 10 నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. లొల్ల లాకులు అభివృద్ధి చేసేందుకు రూ.57 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించామన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ చిక్కాల బ్రహ్మాజీరావు, ఇరిగేషన్‌ సిబ్బంది ఉన్నారు.