
ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... విశాఖ బుధవారం కలెక్టరేట్ వద్ద జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సామూహిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట వందలాదిమంది కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు జి.సుబ్బారావు మాట్లాడుతూ ... పర్మినెంట్ ఉద్యోగులకు పిఆర్ సి అమలు చేయాలన్నారు. మిశ్రా కమిషన్ రిపోర్టును బహిర్గతపర్చాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ అమలు ప్రకటించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు పిఆర్ సి ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిఓ 7 ను సవరించాలని, జిఓ 1615 అమలు చేయాలన్నారు. మరణించిన,60 ఏళ్లు దాటిన కార్మికుల పోస్టులలో కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలాగే 27 శాతం మధ్యంతర భృతి, కరువు భత్యం, ఇంటి అద్దెలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్.కె ఎస్.వి కుమార్, యూనియన్ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, ఎం.వి.ప్రసాద్, టి.నూకరాజు, గొలగాని అప్పారావు, ఉరుకుటి రాజు, జె.అర్. నాయుడు, సీర రమణ, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.