
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ, కలెక్టరేట్ : ఎంతో పేరున్న విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన 3, 4వ జోన్ల పరిధిలోని కెజిహెచ్, కలెక్టర్ ఆఫీస్, అఫీషియల్ కాలనీ, జాలరి పేట, చిన్న వాల్తేర్, ఉషోదయ జంక్షన్, ఎంవిపి.కాలనీ తదితర ప్రాంతాలలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నగరంలో పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. కార్మికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులకు కావలసిన భద్రతాపరమైన నెప్రాన్లు, గ్లౌజులు, మాస్కులతో పాటు పనిముట్లును సకాలంలో అందించాలని ఆదేశించారు. కెజిహెచ్ వద్ద పారిశుధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. ప్రతి కార్మికుడు ఐడి కార్డు కలిగి ఉండాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. అఫీషియల్ కాలనీలో క్లాప్ వాహనాన్ని పరిశీలించారు. డ్రైవర్లు రెండు నెలల నుంచి జీతాలు రాలేదని తెలియజేయగా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉషోదయ జంక్షన్లో భూగర్భ మురుగు నీటి రోబోను పరిశీలించారు. నగరంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ వై.శ్రీనివాసరావు, ప్రధాన ఇంజినీరు రవికృష్ణ రాజు, సిసిపి సురేష్, ఎడి(హార్టికల్చర్) ఎం.దామోదర రావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్జి.శాస్త్రి పాల్గొన్నారు.