May 05,2021 09:20
  • 60 టన్నులకుపైగా అవసరమైతే.. 50 టన్నులే కేటాయింపు
  • సిలిండర్ల కొరతా తీవ్రం
  • చోద్యం చూస్తోన్న ప్రభుత్వం

ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి : విశాఖ జిల్లాకు ఆక్సిజన్‌ కొరత ప్రమాదం పొంచి ఉంది. కోవిడ్‌ కేసులు తగ్గకపోతే ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్న రోగులకు అందించేందుకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే నోటిఫై చేసిన 51 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అవసరాల మేరకు సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అవసరంలేని కాలంలో రోజుకు 25 టన్నుల ఆక్సిజన్‌ వినియోగమయ్యేది. ప్రస్తుతం ప్రతిరోజూ 60 నుంచి 70 టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవుతుండగా, 50 టన్నుల ఆక్సిజన్‌తోనే సర్దుబాటు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రాష్ట్ర అవసరాలకు రోజుకు సరఫరా చేసే 170 టన్నుల ఆక్సిజన్‌లో జిల్లాకు 30 టన్నులు కేటాయిస్తున్నారు. మరో రెండు కంపెనీలు 20 టన్నుల వరకు ఇస్తున్నాయి. కెజిహెచ్‌లో కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి గతంలో ఐదు కిలోలీటర్ల ఆక్సిజన్‌ 24 గంటలు సరిపోయేది. ఇప్పుడు ఎనిమిది కిలోలీటర్ల ఆక్సిజన్‌ 16 గంటలు కూడా రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితి నోటిఫై ఆస్పత్రులన్నింటిలోనూ, ప్రధానంగా 'ఎ' కేటగిరి ఆస్పత్రుల్లోనూ ఉందని అంటున్నారు. ఆక్సిజన్‌ కొరతలేదని ప్రభుత్వ యంత్రాంగ ఎంత చెప్పినా, ఆస్పత్రుల్లో రోగుల అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది.
   ఆక్సిజన్‌ సరఫరాకు 3,600 'డి' టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరం కాగా, ప్రస్తుతమున్న 2,500 సిలిండర్లతోనే నెట్టుకొస్తున్నారు. 'ఎ' కేటగిరిలోని ఓ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరా చేసి, మిగిలిన నోటిఫై ఆస్పత్రులకు అందజేసేలోపు 'ఎ' కేటగిరీలోని ఆస్ప త్రిలో ఆక్సిజన్‌ అయిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో, వెంటనే రప్పించి రోగులకు ఆక్సిజన్‌ అందించలేక పోతున్నారు. అదనపు సిలిండర్లు సమకూర్చి ఆక్సిజన్‌ సరఫరాలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయడం కంటే, ఆక్సిజన్‌ సమస్యలేదని నమ్మించడానికే అధికార యంత్రాంగం తంటాలు పడుతోంది. ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు చనిపోతున్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగంలో పెద్దగా చలనం ఉండడం లేదు. పైగా, ఆక్సిజన్‌ అందక చనిపోలేదని చెప్పుకొస్తోంది. ప్రస్తుతం 46.7 లీటర్ల సామర్థ్యం కలిగిన 'డి' టైప్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు వెయ్యికిపైగా అవసరమని జిల్లా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కొక్క సిలిండర్‌ విలువ రూ.12 వేలు వరకు ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం ఆక్సిజన్‌, ఐసియు, వెంటిలేటర్లపై 2,790 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు మరో 1,100 సిలిండర్ల అవసరమని, ఇందుకు రూ.1.32 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించినట్లు సమాచారం. ఈ సిలిండర్లను గుజరాత్‌ నుంచి రప్పించాల్సి ఉంది. బడ్జెట్‌ సమస్య దృష్ట్యా అదనపు సిలిండర్ల కొనుగోలుకు అధికారులు చొరవ చూపడం లేదు. ఆక్సిజన్‌ సరఫరా, సిలిండర్లు, సిలిండర్ల రవాణా వ్యవస్థను బలోపేతం చేయకపోతే కోవిడ్‌ బారినపడుతున్న రోగులకు ఆక్సిజన్‌ అందించలేని పరిస్థితి మరింత అధికం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.