
మే 19వ తేదీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. అదే రోజున విశాఖలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల లోని విజ్ఞాన కేంద్రాలకు సారథ్యం వహిస్తున్న కా|| బి.వి రాఘవులు, పి.మధు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. విశాఖలో చిరకాలం నుంచి ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న పద్మశ్రీ డాక్టరు ఎస్.వి. ఆదినారాయణ రావు, డా|| ఆర్.శశిప్రభ, వేలాది మంది విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కోచింగ్ ఇస్తున్న పబ్లిక్ లైబ్రరీ సహాయకులు డి.ఎస్ వర్మ, కళారంగంలో నిరంతర కృషి చేస్తున్న బాదంగీర్ సాయి లాంటి ప్రముఖులను విశిష్ట అతిథులుగా ఆహ్వానించాం.
ఉత్తరాంధ్రకు అల్లూరి విజ్ఞాన కేంద్రం మరో మణిహారం. ప్రభుత్వరంగ కేంద్రంగా కళాకారులకు, రచయితలకు నిలయం విశాఖ నగరం. ప్రభుత్వ రంగం వల్ల గతంలో పోర్టు, షిప్‌యార్డు, బిహెచ్‌పివి, జింక్ అన్ని పరిశ్రమల్లోనూ నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, నాటకాల పోటీలు నిరంతరం సాగుతుండేవి. విశాఖ నగరం ఒక కళా కేంద్రంగా విరాజిల్లింది. కానీ గత 30 ఏళ్ళలో కొత్తగా ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా రాలేదు. రంగస్థల రూపాలు మాయమైపోతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో కళారంగానికి ఆదరణే కరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో కళాకారులకు, రచయితలకు కొద్ది సంస్థలు మాత్రమే ముందుకు వచ్చి ఆదరిస్తున్నాయి. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఈ కొరతను కొంతైనా అధిగమిస్తుందని ఆశిస్తున్నాం. అల్లూరి విజ్ఞాన కేంద్రం భవన శంకుస్థాపన జరిగి ఆరేళ్ళయినా రెండేళ్ళు కోవిడ్ కాలంలో పనులు పూర్తిగా స్థంభించిపోయాయి. 2021 నుంచి పనులు పుంజుకుని నేడు భవనం ప్రారంభానికి నోచుకుంది. ఈ భవనం ఏర్పాటుకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఆర్థికంగాను, వస్తు రూపంగాను ఇతోధికంగా తోడ్పడ్డారు. రిటైరైన ఉద్యోగులు, శ్రేయోభిలాషులు, తమ కుటుంబాల్లో పుట్టుకలు, పెళ్ళిళ్లు...అన్నింటా విజ్ఞాన కేంద్రాన్నే గుర్తుతెచ్చుకున్నారు. చివరికి తమ కుటుంబ సభ్యుల మరణాల్లో కూడా ఈ భవనంలో తమ ఆప్తులను చూసుకుంటామని రూ.లక్షలు ఇచ్చిన వారన్నారు. అభ్యుదయ వేదికలకు ప్రజల ఆదరణలో కొదవు వుండదని అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్మాణంలో రుజువైంది. విజ్ఞాన కేంద్రం నిర్వాహకులపై ప్రజలు అత్యంత విశ్వాసం చూపారు. అందువల్లే భారీ స్థాయిలో విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించగలిగాం.
ఈ నెల 19వ తేదీ నుంచి అల్లూరి విజ్ఞాన కేంద్రం అన్ని హంగుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. విశాఖ ఆర్టిసి కాంప్లెక్స్‌కి అర కిలోమీటరు, రైల్వేస్టేషన్‌కి కిమీ దూరంలో నగరం నడిబొడ్డున ఈ భవనం ఏర్పడడం సంతోషకరం. సెల్లార్ సౌకర్యంతో ఐదు అంతస్తుల భవనం సోలార్ ఏర్పాటుకు వీలుగా నిర్మాణమైంది. ఈ నిర్మాణం వల్ల టాప్ ఫ్లోర్లో డైనింగ్‌కు మంచి సౌకర్యం ఏర్పడింది. రెండు అంతస్తులతో నిర్మించిన ఆడిటోరియం ఎకోస్టిక్స్ ఎ.సి లైటింగుతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడి వుంది. మూడో ఫ్లోర్లో 5500 చదరపు అడుగుల్లో బహుళ ప్రయోజనాల హాల్, నాల్గవ అంతస్తులో 2 మినీ హాళ్లతో పాటు, ఐదో అంతస్తులో 9 కార్యాలయాలు వివిధ రంగాలు పని చేయడానికి ఉపయోగపడతాయి. ఇందులో సైన్స్, శాస్త్ర విజ్ఞానం, బాలల కేంద్రం, మహిళాభ్యుదయ కేంద్రం తదితర విభాగాలను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి.
ఉద్దేశానికి తగ్గట్లుగానే ఈ భవనానికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం అని నామకరణం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి ఆశయాలకు అంకితం కావడం ఈనాటి పరిస్థితులకు సముచితంగా ఉంది. మే 7వ తేదీ అల్లూరి 98వ వర్ధంతి. విశాఖలో ఆర్ఎస్ఎస్ వారు వచ్చి అల్లూరి వర్ధంతి ఉత్సవాలు జరిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వానికిగాని, దానిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్కి గాని ఈ ఉత్సవాలు జరిపే నైతికి హక్కు లేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి భరతమాత దాస్య శృంఖలాలను బద్దలుకొట్టడానికి అల్లూరి తన జీవితాన్నే ధారపోశాడు. బ్రిటీష్ సామ్రాజ్యవాద ముష్కరులను నాటి జనసంఫ్‌ు, ఆర్ఎస్ఎస్ ఎక్కడా ఎదిరించలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాణాలు తీస్తున్న చరిత్ర ఆర్ఎస్ఎస్ది. బిజెపి, ఆర్ఎస్ఎస్ కూడా నేడు అమెరికన్ సామ్రాజ్యవాదులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. దేశ సంపదను సామ్రాజ్యవాదులకు దోచిపెడుతున్నారు. అందుకే బిజెపి, ఆర్ఎస్ఎస్కు అల్లూరి పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. ప్రపంచ శాంతిని కాంక్షించి, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే ప్రగతిశీల శక్తులకు అల్లూరి స్ఫూర్తి ప్రదాత. గిరిజన పేదలతో ఘాట్ రోడ్డు వేయించి కూలీ ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకున్న బ్రిటిష్ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా గిరిజన కూలీల కోసం పోరాటం నడిపిన యోధుడు అల్లూరి. అడవిపై హక్కుల కోసం అల్లూరి పోరాడాడు. అటవీ సంపదను కొల్లగొట్టడాన్ని వ్యతిరేకించి పోరాడాడు. కానీ గిరిజన తెగల్లో తగదాలు పెట్టి బ్రిటీష్ వాడు పరిపాలించాడు. గిరిజన తెగలన్నింటిని ఐక్యపర్చి అడవిపై గిరిజన హక్కుల కోసం జరిగిన పోరాటమే గిరిజన హక్కుల సాధనకు నాంది అయ్యింది. 1940వ దశకంలో మందస ప్రాంతంలో వీర గున్నమ్మ, 1967లో కురుపాం ప్రాంతంలో కోరన్న, మంగన్నల నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితమే నేటి ఆంధ్రప్రదేశ్‌లో 1/70 చట్టం. ఈ చట్టం ద్వారా దేశంలో మొట్టమొదటగా గిరిజన హక్కులు సాధించుకోవడం సాధ్యమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా లోని రంపచోడవరంతో సహా జిల్లా లోని అన్ని ప్రాంతాల్లో అల్లూరి నాయకత్వంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగాయి. వారి దురాగతాలను ఎదిరిస్తూ పోలీస్ స్టేషన్లన్నింటిపై పట్టపగలు దాడులు చేశారు. విశాఖ జిల్లా పాండ్రంగిలో పుట్టి నాటి గోదావరి జిల్లాలో పెరిగిన అల్లూరి తెలుగు ప్రజలందరికీ ఆరాధ్యుడు అల్లూరి. అందుకే ఆయన పేర ఈ విజ్ఞాన కేంద్రం.
1991 తర్వాత మన దేశంలో సరళీకరణ విధానాల ఫలితంగా ఆస్తిత్వవాదం, మతోన్మాదం పెరగడానికి మెండుగా అవకాశం ఏర్పడ్డాయి. ప్రజల జీవితాల్లో ప్రతి రంగం మీద వాటి దుష్ఫలితాలు వున్నాయి. నేను, నాది, నాకు అనే వ్యక్తిగత భావాల చుట్టూ ప్రతి ఒక్కరిని ఆకర్షించే పరిస్థితి ఏర్పడింది. ఈ సిద్ధాంతం ప్రజలకు హానికరం. సమిష్టితత్వంతోనే ప్రజల్లో అభివృద్ధి వుంటుంది. ఇది నేటి ఆధునిక ప్రపంచ అనుభవం. అప్పుడే అందరూ బాగుపడతారు. ప్రజల జీవితాల్లోని ప్రతి కోణంలోనూ విజ్ఞాన కేంద్రాల ద్వారా ప్రజల, సాంస్కృతిక జీవనంలో అభ్యుదయ భావాలు అభివృద్ధి కావాలి. ప్రజల్లో సిద్ధాంత, సాహిత్య, సాంస్కృతిక మార్గాల్లో ప్రజలు శాస్త్రీయ ఆలోచనలు ప్రచారంలోకి రావాలి. ప్రజలు విడిపోతే దోపిడి పద్ధతులు మరింత తీవ్రమౌతాయి. కోవిడ్ కాలంలో 2020-21 దేశ జిడిపి 24 శాతం పడిపోయింది. కాని పెట్టుబడిదారుల లాభాలు 550 శాతానికి పెరిగాయి. అభ్యుదయ భావాల మేళవింపుతో ప్రజలకు కళలు, సాహిత్యం, సిద్ధాంతం అన్నింటా ప్రచారానికి ఈ వేదిక ఉపయోగపడాలి. తాత్కాలికంగా ఒడిదుడుకులు వున్నా సమాజం ముందుకు వెళ్తుంది. వెనక్కి మళ్ళదు. అయితే ఇది ఆటోమేటిక్‌గా జరగదు. వెనక్కి మళ్ళకుండా బుద్ధిపూర్వక ప్రయత్నం జరగాలి. ఇది మన బాధ్యత. ఉత్తరాంధ్ర అభ్యుదయ కవులు, రచయితలు, సంస్కర్తలకు పుట్టినిల్లు. 150 సంవత్సరాల క్రితమే గురజాడ అప్పారావు దేశభక్తిని ప్రభోదించారు. మరోవైపున సమాజం లోని మూఢవిశ్వాసాలపై ధ్వజమెత్తారు. గురజాడ చెప్పిన ''మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును'' లాంటి సందేశాలు నేటికీ ఆచరణీయం. శ్రీశ్రీ కవిత్వం, రావిశాస్త్రి కథలు అభ్యుదయ వాదులకు ఆయుధాలుగా పనిచేస్తాయి. పాత తరంలో చివరివారైన కాళీపట్నం రామారావు (కారా మాష్టారు) కథలెంతో గొప్పవి. ఒక కథలో డబ్బు కోసమే వైద్యం చేసే డాక్టర్లపై యుద్ధం చేశారు. ఇది సరళీకరణ విధానాలను చీల్చిచెండాడమే. సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక రంగంలో పోరాటం నేటి యువత కర్తవ్యం కావాలి. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వంటి ప్రాంగణాలు వారిలో చైతన్యం నింపే వేదికలు కావాలి.
/ వ్యాసకర్త : అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ /
సిహెచ్. నరసింగరావు