Nov 22,2020 00:20

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
విశాఖ నగరానికి కాలుష్యముప్పు ఎప్పుడూ పరిశ్రమల వల్ల ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కాని నేడు ఈ నగరాన్ని రాజకీయ కాలుష్యం కమ్మేసింది. 'రాజకీయాలు క్రమబద్ధంగా సంస్థాగతం చేసిన విద్వేషాలు' అని హెన్రీ బ్రూక్స్‌ ఆడమ్స్‌' అనగా, 'రాజకీయాలతో ప్రజలను సంతోష పెట్టాలనుకోవడం దురాశే' అని థామస్‌ కార్లయిల్‌ అంటే, 'ముందుగా ఆలోచించకుండా చేసే పని బహశా రాజకీయాలే కావచ్చు' అని రాబర్ట్‌ లూయిస్‌ స్టీవెన్‌సన్‌ చెప్పారు. ఈ కోణంలో చూస్తే.., నేటి రాజకీయాల్లో ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం గాకుండా పార్టీలు, వారి ప్రాపకం నిలుపుకోడానికి చేసే ప్రయత్నాలే అధికంగా కనిపిస్తున్నాయి. విశాఖలో గడచిన కొన్నాళ్లుగా ఏవిధంగా చూసినా విద్వేష కోణాలే కనిపిస్తున్నాయి. అందాలకు, సుందర ప్రదేశాలకు, పరిశ్రమలకు నెలవుగా దేశ, విదేశాల్లో విశాఖకు పేరుంది. ఇవేమీ పట్టకుండా రాజకీయ వివాదాలు, విద్వేషాలకే ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ప్రజా సమస్యలు, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌పై శ్రద్ధ ఏది?
ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కేంద్రంలోని బిజెపి మోడీ పాలన వల్ల ప్రమాదం ఏర్పడి ఒక్కో పరిశ్రమపైనా నీలినీడలు పడుతున్నాయి. వైజాగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌గా పిలవబడే స్టీల్‌ప్లాంట్‌లోకి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో వచ్చేలాగ కేంద్రం చర్యలు చేపడితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం తలూపింది. ప్రభుత్వ రంగ పరిశ్రమ భవిష్యత్‌, విశాఖలో లక్షలాది మంది ప్రజల జీవనంపై ప్రభావం చూపే చర్యపై పాలకవర్గ రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు. భూ సమస్యలు విశాఖలో తీవ్రంగా పెరిగిపోతున్నాయి. వీటి జోలికి వెళ్లడం లేదు. అధికార, ప్రతిపక్ష నేతలకు వీటిల్లో భాగస్వామ్యం ఉండడమే కారణంగా ఉంది. ఎండాడ, పిఎం.పాలెం, బక్కన్నపాలెం ప్రాంతాల్లో ప్రభుత్వ చెరువులు, సీలింగ్‌ భూములను కబ్జా చేసి వెంచర్‌లు వేసుకోడంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు బిజీగా ఉన్నారు. ఇవన్నీ విశాఖ వాసుల్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వైజాగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడమంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలపై ఉక్కుపాదం మోపే విధానాలు ఎంత మాత్రం కాదన్నది పాలకులు గుర్తెరగాలి. తమ పార్టీ అధికారంలో ఉండగా ఒక్క సెంటు భూమి కబ్జా కానివ్వమంటూ వైసిపి బీరాలు పలికి నేడు చతికిలపడింది. భూ కుంభకోణాలపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గడచిన ఏడాదిగా ఫిర్యాదులు తీసుకోడానికే పరిమితమైంది. విశాఖకు అతిముఖ్యమైన వాల్తేరు డివిజన్‌ను కేంద్రం లేకుండా చేసింది. రైల్వే జోన్‌ (సౌత్‌ కోస్ట్‌) ప్రకటించి ఇంతవరకూ అతీగతీ లేకపోయినా ప్రధాన పార్టీలు ఈ సమస్యలను గాలికొదిలేశాయి. సిపిఎం, వామపక్షాలే ప్రధాన ప్రజా సమస్యలపై పోరాడుతూ పాలకుల విధానాలను ఎండగడుతున్నాయి.
ఒకరిపై ఒకరు వాదులాటలతోనే సరి...
తమ పార్టీని టార్గెట్‌ చేసే వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ తమ వారిపై దాడులు, తమ వారి వ్యాపారుల స్థలాలు, ఇళ్లను కూలగొడుతున్నారంటూ టిడిపి నేతలు నిత్యం ఆరోపిస్తున్నారు. సదరు వ్యాపారులు తమకు రాజకీయాలతో సంబంధం లేదని, కేవలం వ్యాపారాల కోసమే విశాఖ వచ్చామని చెప్పినా 'తగుదునమ్మా'... అంటూ టిడిపి నేతలు రాజకీయ కుట్ర అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు, కబ్జాలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం తాజాగా స్పందించడంలో తప్పేముందంటూ వైసిపి శ్రేణులు ఎదురు వాదనకు దిగుతున్నాయి. అదే సమయంలో సందిట్లో సడేమియాలా వీరు కూడా తమ భూ ఆక్రమణ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భోగాపురం ఎయిర్‌ పోర్టును నిర్మిస్తే 30ఏళ్ల పాటు విశాఖ ఎయిర్‌పోర్టును మూసెయ్యవచ్చని, అది నేవీదంటూ విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు విశాఖ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. మొత్తానికి రాజకీయ విద్వేషాలే విశాఖ నగర వాతావరణాన్ని అలముకోవడం అంతటా చర్చనీయాంశమైంది.