Jul 18,2021 11:52

    నాగన్నకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఈ మధ్యనే కొడుకు పెద్ద రంగన్న కరోనాతో పోయాడు. తొమ్మిది రోజుల దినం కూడా చేయలేదు. ఇప్పటికే కోడలు ఇరుగుపొరుగుకు ఆస్తి అడగాలని, తన పేర్న చేయించుకోవాలని చెప్తా వుంది. పక్కింటోళ్ళకు కూడా తెలీకుండా ఊళ్ళో పెద్దమనుషులకు చెప్పి, ఇద్దరు కొడుకులకు ఆస్తి సమానంగా పంచాలని, వీలైతే చిన్న కొడుక్కే ఆస్తి అడుగుదామని కూడా వుంది. ఎందుకంటే పెద్దోడు, వాడి భార్య ఇద్దరూ ఉద్యోగులే. పెద్దోడు పోయాడు కాబట్టి పెద్దోడి పెన్షనూ కోడలికొస్తుంది. కుదిరితే చిన్నోడికి ఉన్న రెండున్నరెకరాల పొలం మొత్తం ఇవ్వాలి. ఇలా న్యాయం కాదంటే ఇద్దరికీ సమానంగా పంచాలని అనుకుంటున్నాడు. తగాదా లేకుండా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని ఉంది. ఆస్తి పంపకం సమస్య లేకుండా ఎలా పరిష్కరించుకోవాలో అని ఇంటిముందు వైర్ల మంచం మీద కూచుని, ఆలోచిస్తున్నాడు నాగన్న.
ఈ సమస్యను వరసకు మేనల్లుడైన నవీన్‌కు చెబితే కాస్త ఏదైనా పరిష్కారం చూపుతాడని అనుకుని, అనుకున్నదే తడవుగా తన భార్య పద్మను పిలిచి 'మీ చిన్నాయన కొడుకు నవీన్‌కు ఫోన్‌చేసి, ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు' అన్నాడు.
పద్మ ఫోన్‌ చేస్తూనే ఉంది. స్విచాఫ్‌ అని వస్తుంది. ఆ విషయం చెబుతుండగానే నాగన్న ఫోన్‌ మోగింది..
'హలో మామా బాగున్నావా? నా ఫోన్‌ పాడైంది. రిపేరికిచ్చాను. పాత సెల్లులోకి ఇప్పుడే సిమ్‌కార్డు మార్చుకున్నాను. నీవు ఫోన్‌ చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. ఏంటి చెప్పు విశేషాలు..?' గడగడా మాట్లాడుతున్నాడు నవీన్‌.
దుఃఖాన్ని అదిమిపట్టుకుని నాగన్న 'నీకు తెల్సిందే కదా, మా పెద్దోడు కరోనాతో పోయాడు. వాడి భార్య ఆస్తి అడగాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇవ్వాల్సిందే, కాదనడానికి లేదు. మన కుటుంబం గూర్చి పదిమందికి తెలిపి, పంచాయితీ పెట్టియ్యడం నాకిష్టం లేదు. నలుగురు పెద్దల సమక్షంలో ఏ గొడవా లేకుండా గుట్టుగానే ఆస్తి పంచివ్వాలని నాకుంది. కానీ మా ఊరు షావుకారే పెద్దసమస్యలో ఇరుక్కున్నాడు. ఆయన వద్దకు వెళ్ళే పరిస్థితి లేక, నీవే ఏదైనా ఒక సలహా ఇస్తావేమోనని ఫోన్‌ చేశా..'
'ఉన్నదే రెండున్నరెకరాలు. ఎంతొస్తుంది? తలా ఒకటింబావెకరానే కదా! అయినా ఆ అమ్మాయి ఉద్యోగస్తురాలే కదా, ఈ ఆస్తి ఏం చేసుకుంటుందంట..?'
'ఏం చేసుకుంటుందంటే, ఏమైనా చేసుకోని.. తన భర్తకు రావలిసిన ఆస్తి తనకివ్వాల్సిందే కదా! పైగా ఇద్దరమ్మాయిలు వాడికి..' నిట్టూరుస్తూ మాట్లాడాడు నాగన్న.
'అవును మామా నాకు తెలీకడుగుతున్నాను. వాడికి మహా అయితే 39 ఏళ్లు. చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు కదా, ఎలా జరిగిందంటావు..?' బాధగానే అడిగాడు నవీన్‌.
'నాకెలా తెలుస్తుందల్లుడూ? నేనిక్కడ.. వాళ్ళు సిటీలో..ఎలా బతుకుతున్నారో ఏమో..ఆస్తులు కొంటున్నాడని తెలిసింది. ఆస్తి కంటే ఆరోగ్యం ముఖ్యమని మీ అక్క, నేనూ చాలాసార్లు చెప్పాము. కారు కొన్నప్పుడు సంబరపడ్డాము. ''అయినా ఇవన్నీ మనకెందుకురా, నాల్గురాళ్ళు ఉండాలి. అంతేకానీ ఆ రాళ్ళ కోసం ఇంతలా కష్టపడాల్సిన పనేమి?'' అని అంటూనే ఉన్నాము. ''ఇద్దరూ ఉద్యోగస్థులే కదా! అవే పొదుపు చేసుకుని, బతకండీ!'' అని చెప్పాము. ఎలా వచ్చిందో ఏమో ఈ మాయదారి కరోనాతో వాడి జీవితమే అంతమయ్యింది. వాడి మీద పెట్టుకున్న మా ఆశలు ఆవిరయ్యాయి!' అంటూ బాధపడ్తూ చెప్పాడు.
'సర్లే మామా! నేను రెండ్రోజుల్లో ఇంటికొస్తాలే అన్నీ మాట్లాడదాము..' అని బాధగానే ఫోన్‌ కట్‌చేశాడు నవీన్‌.
కానీ తన మామయ్య కొడుకు పెద్ద రంగన్న అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నాడు నవీన్‌. bలాగైనా మరణానికి దారితీసిన పరిస్థితులన్నీ తెలుసుకోవాల నుకున్నాడు. ఎవర్నడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయో అనుకుంటూ.. ఆలోచించసాగాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ నెంబర్లు కనుక్కోవాలి. కనుక్కోవడం పెద్దసమస్యేమీ కాదు. వాడు పనిచేసే విద్యాశాఖలో చాలామంది నవీన్‌కు ఫ్రెండ్సున్నారు. నవీన్‌ ఇన్వెష్టిగేషన్‌ జర్నలిస్టే కాకుండా సమాజంలో పేరున్నవాడు. నెట్‌లో పెద్దరంగన్న వాళ్ళ హెచ్‌ఎం నెంబర్‌ సంపాదించి, ఫోన్‌ చేశాడు. రింగ్‌ అవ్వగానే తనకుతాను పరిచయం చేసుకొని..'సార్‌ మిమ్మల్ని ఒకసారి కలవాలి' అన్నాడు నవీన్‌.
'చెప్పండి సార్‌! విషయం ఏంటో ఫోన్‌లోనే చెప్పండి. ఈ ప్యాండమిక్‌ సిట్యుయేషన్‌లో కలవడమొద్దులెండి సార్‌. రంగన్న సార్‌కు సంబంధించి అన్ని ప్రొఫార్మాలూ సిద్ధం చేసి డిఈఓ గారికి సబ్మిట్‌ చేస్తాము. రావాల్సిన బెన్ఫిట్స్‌ అన్నీ వస్తాయి. ఆ మాత్రం చేయలేమా మేము? మంచి టీచర్‌ను పోగొట్టుకున్నాం' హెచ్‌ఎం బాధతోనే చెప్తున్నాడనిపించింది.
'అది సరే సార్‌, మా వాడు ఇంత చిన్నవయసులోనే పోవడం అర్థం కావడం లేదు సార్‌!' ఆవేదనగానే అన్నాడు నవీన్‌.
'మీరేమీ అనుకోకపోతే నేనొక మాట చెప్పనా.. ఒక మంచి టీచర్‌ డబ్బు వ్యామోహంలో పడితే ఫలితాలెలా ఉంటాయనడానికి ఉదాహరణే ఈ మరణం. నిరంతరం పిల్లల శ్రేయస్సే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్న విలువలున్న ఉపాధ్యాయుడతడు. ఏమైందో ఏమో గతేడాది నుండి తనలో చాలా మార్పు వచ్చింది. పిల్లలకు బుద్ధిగా పాఠాలు చెప్పి, స్టాఫ్‌రూంలోకి వచ్చి మా అందరితో సరదాగా గడిపే మనిషి మారిపోయాడు. క్లాస్‌ అయిన వెంటనే విపరీతమైన ఫోన్లు. ఏవో ఆర్థికలావాదేవీలు నడుపుతున్నాడనిపించింది. ఒకసారి నేనే అన్నాను. చూడు రంగన్నా నేను నీకు హెడ్మాష్టర్‌గానే కాక పెద్దవాడిగా నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను, మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి. మన స్థాయికి మించి ఆస్తులైనా, అప్పులైనా చేయడం మంచిది కాదని చెప్పాను. అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదని ఎప్పుడూ ఆ ప్రస్తావన తనతో తీసుకురాలేదు. స్కూల్లో బాగుంటే చాల్లే అనుకున్నాను. కొన్ని సందర్భాల్లో నాకనిపించింది, ఈ తరం పిల్లలు డబ్బే పరమావధిగా బతుకుతున్నారని. దురాశ దుఃఖానికి చేటు అనడానికి పెద్దరంగన్న మరణమే ఒక ఉదాహరణ. ఇంతకంటే నా దగ్గర మాటల్లేవు. ఇంతకంటే ఏం చెప్పాలి సార్‌?' అంటూ చెప్పుకొచ్చారు హెచ్‌యం.
ఒక్కసారిగా కుప్పకూలినంత పనైంది నవీన్‌కి. 'అసలేమంటున్నాడీయన. ఏమిటీ దురాశ? ఏం చేశాడసలు? యవ్వారాలు చేస్తున్న టీచర్లు చాలా మంది ఉన్నారు. అటువంటివి వాడు చేయడే..?' ఇలా ఆలోచిస్తూనే.. 'సరేసార్‌ ఉంటా'నని అన్నాడో లేదో.. వెంటనే ఫోన్‌ కట్టయ్యింది..
ఈ మరణానికి సంబంధించి కనుక్కోవాలనే ఆతృతలో అనేక కొత్త విషయాలు బయటికొస్తున్నాయి.

                                                                                 ***

   ఆ ఊళ్ళో నాగన్నను కలింగర పండ్ల నాగన్న అంటారు. ఆ ఊళ్లో తనకున్న రెండున్నరెకరాల్లో కలింగర పండ్లు పండించి, సిటీకి తీస్కబోయి అమ్మడంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. కర్నూలు సిటీలో అన్ని సెంటర్లలో పండ్లమ్మేవాడు. వచ్చిన డబ్బుతోనే వ్యవసాయం, ఇద్దరు కొడుకుల చదువులు. పెద్దోడు పెద్దరంగ న్నను టీచర్‌గా చేశాడు. డీయస్సీలో నేరుగా స్కూల్‌ అసిస్టెంటే కొట్టాడు. చిన్నోడు చిన్నరంగన్న టిటిసి చేసినా ఉద్యోగం రాకపోయేసరికి వ్యవసాయంలో తోడుగా పెట్టుకున్నాడు. ఈ మధ్య రెండేళ్ళ నుంచి పండ్లమ్మడం మానేసి, ఉపాధిహామీ మేటీగా వెళుతున్నాడు. వ్యవసాయం, పండ్లవ్యాపారం రెండూ వదులుకున్నాడు. కారణం కర్నూల్లో పోలీసులు బెడద తట్టుకోలేకే. ఏ సెంటర్‌లో పండ్లమ్మినా కార్పొరేషను పర్మిషనుందా..? ట్రాఫిక్కు ఇబ్బంది.. అంటూ చలానాలు.. లంచా లు.. ఇవేకాక ఖాకీ డ్రస్సు వేసుకున్న ప్రతిఒక్కడికీ ఉచితంగా ఎన్ని పండ్లడిగితే అన్ని ఇవ్వాల్సిందే. ఆ జలగల బారి నుండి అతను తప్పించుకోవడం చేతకాలేదు. వ్యవసాయంలోనే బతుకును అందంగా, అప్పు లేకుండా మలుచుకున్నాడు. కానీ వదిలేసేలా చేశారీ తోడేళ్ళు.
       నాగన్న పొలంలో ఏ పంట వేసినా ప్రతి పంటలో బాగా లాభం తీస్తాడు. అందరిలా కాక వాణిజ్యపంటల్నే వేస్తాడు. వేరుశనగ వేశాడంటే, ఆ దిగుబడి తీసుకెళ్ళి ఒకేసారి మార్కెట్‌లో అమ్మడు. ఏడాది పొడవునా పట్నానికి తీసుకెళ్ళి, వేరుశనగ కాయల్ని కాల్చి ఏడాది పొడవునా అమ్మి సొమ్ము చేసుకుంటాడు. రూపాయికి రూపాయి కూడబెట్టి, సంపాదిస్తాడు. ఒక్కోసారి పొద్దుతిరుగుడు వేసినా అంతే.. పట్నానికి పోయి ఇలానే అమ్ముతాడు. చాలా తెలివైన రైతుగా చెప్పుకుంటారు. అయితే బాగా అచ్చొచ్చింది మాత్రం కలింగర పండ్లే. ఈ మధ్య ప్రతీ ఏడు అవే వేసేవాడు. కానీ నగరంలో రాబందుల దాడికి కలింగర పండ్ల వ్యవసాయమే వదిలేశాడు. ఎంతబాగా పంట పండిస్తే ఏంలాభం, కష్టపడి పండించే పంటను గద్దల్లా తన్నుకుపోయే వాళ్ళను చూసి విసుగెత్తి వదిలేశాడు. ఊళ్ళో రైతులందరూ చాలా మంది 'నాగన్నా.. మాకు bన్ని ఎకరాలున్నా ఏం ప్రయోజనం? నీవు రెండెకరాల్లోనో లక్షలు సంపాదిస్తున్నావు' అంటే.. ముసిముసిగా నవ్వి 'మనచేతుల్లో ఏముందయ్యా పైనున్నోడు ఎంతిస్తే అంత మన కడుపుకబ్బుతుంది.' అంటూ గర్వంగా తలకు రుమాలు కట్టుకునేవాడు. ఇప్పుడు పొలం పక్కకు వెళ్ళడమే మానేశాడు. కౌలుకిచ్చేశాడు. వ్యవసాయం చేస్తే తను అందరికంటే బాగా సంపాదించేటోడు. వ్యవసాయంలో బాగా మెలకువలు తెలిసిన అట్లాంటోడు వదిలేశాడు. చిన్నకొడుకు రంగన్న కూడా పట్నంలో ఫోటో స్టూడియోలో పనికి కుదిరాడు. పెద్ద రంగన్న ఆకస్మిక మృతితో తన జీవితంలో ఉరుముతో పాటు పిడుగులు కూడా పడినట్లైంది.

                                                                              ***

    బైక్‌ ఇంటి ముందాగింది. నాగన్న, అతని భార్య లక్ష్మీదేవి ఎదురొచ్చి.. 'రారా నవీనూ లోపలికి రా.. నీ అల్లుడి కడపటి చూపుకు కూడా రాలేదు కదరా!' అంటూ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని, నిష్టూరంగా మాట్లాడింది లక్ష్మీదేవి.
'నీకు తెల్సుకదక్కా.. నేనప్పుడు ఊళ్ళో కూడా లేనని. నాకు రావాలని ఉండదా? రాలేని పరిస్థితుల్లో రాలేదంతే..' కన్నీళ్ళతోనే చెప్పాడు నవీన్‌.
'సరే మీరేం బాధపడకండి'.. అంటూ ఓదారుస్తూనే తన కంటిచెమ్మ తుడుచుకుంటున్నాడు.
'ఇంకేంటి నవీనూ పిల్లలు బాగున్నారా?' నాగన్న టవల్‌తో తడి తుడుస్కుంటూనే అడిగాడు.
'బాగున్నారు మామా!'
'ఇలా జరుగుతుందని ఊహించలేదురా. ఈ మధ్య బాగా దూరంగానే ఉన్నాడు. నెలకో, రెణ్ణెళ్ళకో రెండు మూడు వేలు పంపేటోడు. పంపకపోయినా పర్లేదు వాడు బాగుంటే చాలని అనుకున్నాము. కానీ వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందనుకోలేదు' అంటూ లక్ష్మీదేవి మళ్ళీ కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుంది.
'ఇంట్లో ఎవరికైనా ఉద్యోగమిస్తారా..?' నాగన్న ఆశగా అడుగుతున్నాడు.
'రూలు ప్రకారం ఎవరికీ ఇవ్వరు మామా.. ఎందుకంటే వాడి భార్య కూడా ప్రభుత్వ టీచరుద్యోగం చేస్తుంది కాబట్టి ఇవ్వరు.. అయినా ఎవరికోసం అడుగుతున్నావు..?'
'చిన్నరంగడు కూడా టిటిసి చదివాడు కదా.. ఇద్దరూ మేకసండ్లలాగా కలిసే పెరిగారు. వాడికింత వరకు ఏ ఉద్యోగం రాలేదు. వాడి ఉద్యోగం చిన్నోడికన్నా ఇస్తారేమో అని ఆశ. వాడి జీవితమన్నా బాగుపడుతుందని' లక్ష్మీదేవి చెప్పింది.
'రాదులేక్కా వదిలెరు. వాడే పోయాక ఇంకేం ఆశపడ్తారు?
'ఇంతకూ ఎలా జరిగందనుకుంటున్నారు..?' నవీన్‌ ఇద్దరినీ ఒకేసారి చూసి ప్రశ్నిస్తున్నాడు.
'ఎలా ఏముందిరా.. కరోనానే కదా..' లక్ష్మీదేవి ఆశ్చర్యంగా అంటుంది.
'లేదక్కా జబ్బు బాగా నిర్లక్ష్యం చేశారు. జ్వరం వారం రోజుల నుంచి వస్తున్నా అదేం చేస్తుందిలే అని అనుకున్నారు. సొంత వైద్యంతో చికిత్స చేసుకున్నారు. ఇంట్లో డబ్బులు కూడా లేవంట. వాళ్ళ ఫ్రెండునడిగి డబ్బు తీసుకుని, డాక్టర్‌ దగ్గరికి వెళ్ళారంట. కానీ చాలా క్లోజుగా ఉన్న ఫ్రెండ్సు నడగకుండా మామూలు పరిచయమున్న వాళ్ళని అడిగారు.'
'అవునా!' అంటూ నవీన్‌ చెప్తున్న మాటల్ని జాగ్రత్తగా వింటున్నారిద్దరు.
'ఇప్పుడెవరినని ప్రయోజనం లేదు మామా. చదువుకునే రోజుల్లో చదువు. ఆ తర్వాత ఉద్యోగం. వెంటనే పెళ్ళి ఏ బాదరా బందీ లేదనుకుంటుంటే. వాణ్ణి డబ్బుల్ని ప్రేమించేలా చేశారు. పెళ్ళైన వెంటనే సొంతిల్లు ఉండాలన్నారు. సిటీలో ఇల్లు కొన్నాడు. తర్వాత ఆడపిల్లలున్నారు. మేం కూడా చెయ్యేస్తాం ప్లాట్లు కొనమని వాళ్ళ మామ హామీ ఇచ్చేసరికి, అప్పు చేసి మరీ ప్లాట్లు కొన్నాడు. తక్కువ రేటుకొస్తుందని ఇంకేదో ల్యాండ్‌ కొన్నాడంట వాళ్ళ మామ సలహాతోనే. అంత అత్యాశ అవసరమా వాడికి? జీవితాన్ని ఏం అనుభవించాడు వాడు. పెళ్ళైనప్పటి నుంచి డబ్బు వైపు, ఆస్తుల వైపు పరుగులు పెట్టించారు. ఇద్దరి సంపాదనతో ఆస్తులు కూడగట్టుకోవడం, అప్పులు తెంపుకోవడం కష్టమని భావించి ఈయస్సార్‌లు చేయడం మొదలెట్టాడు..'
'ఈయస్సార్‌లంటే?'.. నాగన్న ఆశ్చర్యంగా అడుగుతున్నాడు..
'అదే మామ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్లు అన్నీ కంప్యూటరైజేషన్‌ చేస్తున్నారు. కంప్యూటర్‌ నాలెడ్జి చాలామందికి తెలిసుండదు. వాళ్ళ రిజిస్టర్లు కంప్యూటరైజేషన్‌ చేసిస్తాడన్నమాట. అంటే ఒక్కో యస్సార్‌కు మినిమం వెయ్యి నుండి మూడు వేలు ఫీజు తీసుకుంటారు. అలా నీ కొడుకు దాదాపు ఐదువందలకు పైగా ఈయస్సార్‌లు చేశాడంట. ఈ క్రమంలో ఒక్కొక్కరితో చాలా సార్లు ప్రత్యక్షంగా మాట్లాడాల్సి ఉంటుంది. సర్వీసుకు సంబంధించి అనేకానేక సమస్యలు వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఫోన్‌లో మాట్లాడలేరు.ఈ క్రమంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఈ కరోనా వచ్చిండొచ్చు. ఇలా కంప్యూటర్‌ పని చేస్తూ వచ్చిన డబ్బులతో ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నంలో అప్పులు చేస్తూ, వాటిని తీరుస్తూ నిరంతరం బిజీగా గడిపాడు.' నవీన్‌ మాటలు వింటూనే ఏడుస్తున్నారిద్దరు.
వాళ్ళ హెడ్మాష్టర్‌ తనకు ఫోన్‌లో చెప్పిన దురాశ దుఃఖానికి చేటు అన్న మాట కూడా నవీన్‌ గుర్తు చేశాడు.
'అవున్రా నవీనూ! ఈ జబ్బుకు మందే లేదా.. ఏదో సూదులు ఏస్తున్నారంట కదా..?' లక్ష్మీదేవి కళ్ళు తుడుచుకుంటూ అనింది.
'ఉందక్కా వ్యాక్సిన్‌ వేస్తున్నారు..'
'మరి నీ అల్లుడు వేసుకునుంటే బాగుండేది కదరా! మనకు దక్కేటోడు..'
'నలభైఐదేళ్ళు నిండినవాళ్ళకే వేస్తారక్కా. నీ కొడుక్కి నలభై ఐదేళ్ళు నిండలేదు. ప్రతీ విషయంలో జాగ్రత్త పడేటోడు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాడు. వారం రోజులుగా జ్వరం వచ్చినా కరోనా టెస్టు చేయించుకోలేదు. జ్వరమే కదా ఏం చేస్తుందనే అలక్ష్యం. రోజు రోజుకు జబ్బు శృతిమించిపోయింది. తీవ్రమయ్యాక ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకుపోవడం. చికిత్స తీసుకుంటున్న రెండో రోజుకే ఆక్సిజన్‌ అందక చనిపోవడం. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.'
'మనం గుర్తించుకోవలసిందొక్కటే అక్కా. ఏ జబ్బు వచ్చినా మనిషికి మనోధైర్యం ఉండాలి. జబ్బు కంటే భయమే మనిషిని చంపేస్తుంది. నన్నేం చేస్తుందిలే అనుకున్నవాళ్ళు కోలుకుంటూనే ఉన్నారు. ఏమైతుందో ఏమో అని గుండెధైర్యం లేనోళ్ళంతా పోతున్నారు. నీ కొడుకు చేసిన తప్పేమంటే తను ఎప్పుడైనా తన ఆనందాలు మాత్రమే అందరికీ పంచుకున్నాడు. కానీ, కష్టాలు ఎవరికీ చెప్పుకోలేదు. కష్టాలు పంచుకుని వుంటే ఎవరో ఒకరు స్పందించి, వాళ్ళకు చేతనైన సహాయం చేసేవాళ్ళు. వాడు నేనేప్పుడు మాట్లాడినా పిల్లలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి దేంట్లో లేదని చాలాసార్లు చెప్పేవాడు. వాడు మంచి ఉపాధ్యాయుడు. ఈ సమాజాన్ని చదువు ద్వారానే మార్చాలని నిరంతరం తాపత్రయపడిన మహోన్నతుడిని డబ్బు వెంట పరిగెత్తేలా చేశారు. మూడు నాలుగు నెలల నుంచి వాడు పూర్తిగా మారిపోయాడు. ఫోన్‌ కూడా సరిగ్గా చేయలేదు. అంత విజన్‌ ఉన్నవాడికి ఆస్తుల మీద మమకారం వచ్చింది. ఈ సమాజం వాడికి వ్యామోహల్ని పరిచయం చేస్తే, వాడు నిర్మించుకున్న మానవ సంబంధాలు డబ్బుకు మరింత బానిసను చేసి, వాణ్ణి చంపేశాయి' అని నవీన్‌ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు.
'ఇక నేను వెళ్ళస్తాను మామా.. పెద్ద రంగన్నకు సంబంధించిన అన్ని పేపర్లు సబ్మిట్‌ చేయించి, రావాల్సిన బెన్ఫిట్స్‌ వచ్చేలా నేను ప్రయత్నిస్తాలే. ముందు మీరు ధైర్యంగా ఉండండి. నేను వచ్చే ఆదివారం వచ్చి, ఆస్తి పంపకాలు కూడా మాట్లాడి, చేద్దాంలే మన మాట కాదనదులే' అని చెప్పి బయలుదేరాడు.

                                                                                 ***

    డబ్బు ఎంతటివాణ్ణైనా కాటేస్తుందని, ఆ విషనాగు కాటేయక మునుపే మనుషులుగా బతకాలని నాగన్నకు అనిపించింది. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతకడం ఈ తరానికి చేతకాదని, ఎంత ఆకలైనా అన్నమే మనిషి తింటాడని డబ్బు పళ్ళెంలో వేసుకొని తినడని నాగన్న ఆలోచిస్తూనే ఉన్నాడు.

కెంగార మోహన్‌
9493375447