Jul 21,2021 21:15
శ్రీకాకుళం జిల్లా బూర్జలో వర్షాలకు వరి పొలంలో చేరిన నీరు

* నేడూ వానలకు అవకాశం
ప్రజాశక్తి-యంత్రాంగం :
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలుచోట్ల పొలాల్లో నీరు చేరింది. ఈదురు గాలులకు విద్యుత్తు వైర్లు తెగిపడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో 25.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు బూర్జ మండలంలో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలోని హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని ముంతాగుమ్మి, బిర్రిగూడ వాగుల ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 26 గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో 53 మండలాలకుగాను 48 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో 6.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, వెల్దుర్తి మండలంలో అత్యధికంగా 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఏజెన్సీలోని రాజవొమ్మంగి, మారేడుమిల్లి, చింతూరు, విఆర్‌.పురం మండలాల్లో వాగులు పొంగి ప్రవహించాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడ్డాయి. సాయంత్రం వర్షం జోరందుకుంది. దీంతో, నారుమళ్లు మళ్లీ ముంపునకు గురవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగెనపూడి బీచ్‌, కోడూరు మండలం హంసలదీవి వద్ద బీచ్‌లలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తూర్పు కృష్ణా ప్రాంతంలో ఈ ఏడాది ఎక్కువగా వరిలో వెదసాగును చేపట్టారు. వర్షాలతో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ముసుగు రెండు, మూడు రోజులు కొనసాగితే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తుంపర్లు పడ్డాయి. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి, మోస్తరు వర్షాలు పలు చోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కొన్నిచోట్ల పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.