May 05,2021 07:34

   అమెరికా, బ్రిటన్‌, ఇతర దేశాల్లో సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ... ఇక్కడ ఇసుమంతైనా జాగ్రత్త పడ్డారా? ఆసుపత్రులు కట్టారా? బెడ్లు పెంచారా? ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్మించారా? అందరికంటే ముందే వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నామని కోతలు తప్ప...టీకా తయారు చేయడానికి కంపెనీలకు ఆర్థిక సహాయం చేశారా? దేశంలో టీకా తయారు చేస్తున్న కంపెనీలకు బయానా ఇచ్చి వ్యాక్సిన్లు బుక్‌ చేశారా? ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం ఎదుర్కోడానికి అన్ని దేశాలు ఏం చేస్తున్నాయో కూడా చూడరా? చైనాను చూడకపోయినా మోడీ మిత్ర దేశాలు చేస్తున్నది కూడా చూడరా? తనకు తెలియదు. శాస్త్రవేత్తలు చెప్పింది వినరు.
   ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరిలో భారత్‌ కోవిడ్‌-19ను జయించిందని ప్రపంచ ఆర్థిక వేదిక మీద ప్రకటించారు. అక్కడితో ఆగకుండా మందులు, వ్యాక్సిన్లు అందించి ప్రపంచాన్నే రక్షిస్తున్నదని చెప్పారు. ఆ భ్రమ నుండి బయట పడేందుకు మూడు నెలలు కూడా పట్టలేదు. పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రపంచ గురువు అనుకుంటున్న మనకి ప్రపంచమంతా సానుభూతితో సహాయం ప్రకటిస్తున్నది.


                                                విదేశీ మీడియా ముందు దోషిగా మోడీ

   బెడ్లు లేక అంబులెన్సుల్లో, స్వంత కార్లలో ఆసుపత్రుల ముందు క్యూ లైన్లలో ఉన్న కోవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ లేక ఆసుపత్రుల ముందే రోడ్ల మీదే పిట్టల్లా రాలిపోతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి శ్మశానంలో ఖాళీలు లేవు. ఈ విధంగా కోవిడ్‌ వలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ఇండియాను ఆదుకోవటానికి ఆక్సిజన్‌, వైద్య పరికరాలు పంపిస్తామంటూ 40 దేశాలు పైన ఆపన్న హస్తం అందించాయి. మోడీ, బిజెపి అభిమాన దేశమైన అమెరికా మినహా వారు శత్రువుగా భావించే చైనా, పాకిస్తాన్‌ సైతం దాతృత్వం చూపుతున్నాయి. కరోనా టీకాకు అవసరమైన ముడిపదార్ధాలు ఎవరికీ ఇచ్చేది లేదని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇందుకు మోడీ మూర్ఖత్వం, అసమర్ధతే మూలమని మీడియా ఘోషిస్తోంది.
 

                                                ఏ మూలకూ చాలని వైద్య సదుపాయాలు

   భారత దేశంలో వైద్య వ్యవస్థ దుస్థితిని, కోవిడ్‌ ప్రమాద తీవ్రతను నారాయణ హెల్త్‌ చైన్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డా|| దేవీ ప్రసాద్‌ సెట్టి ఒక ఉపన్యాసంలో గణాంకాలతో సహా వివరించారు. అందుకు తక్షణమే తీసుకోవలసిన చర్యలను కూడా చెప్పారు. ఇపుడు రోజుకు అధికారికంగా దాదాపు 4 లక్షల కేసులు నమోదవుతున్నా... వాస్తవానికి ప్రతి రోజూ 15-20 లక్షలకు విస్తరిస్తున్నదని చెప్పారు. ఇపుడు నమోదవుతున్న ప్రతి పాజిటివ్‌ కేసుకి ఐదు నుండి పది వరకు టెస్టులు చేయని పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ప్రతి ఐదు పాజిటివ్‌ కేసులకు ఒక ఐసియు బెడ్‌ కావాలన్నారు.
   ఇపుడు మన దేశంలో 75 నుండి 90 వేలు ఐసియు బెడ్లు ఉన్నాయి. మరో ఐదు లక్షల బెడ్లు కావాలన్నారు. ఆసుపత్రులు, బెడ్లే వైద్యం చేయవు. వైద్యం చేసేందుకు రెండు లక్షల నర్సులు, 1.75 లక్షల డాక్టర్లు అవసరమని చెప్పారు. కోవిడ్‌ రెండవ దశ మరో రెండు వారాల్లో ఉధృతం అవుతున్నందున వెంటనే ఈ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చుకోవాలో కూడా చెప్పారు. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి విజ్ఞులు చెప్పింది వింటుందో లేక జనం చస్తే భూమికి భారం తగ్గుతుందని ఆర్‌యస్‌యస్‌ చెప్పినట్లు వింటుందో చూడాలి.
 

                                                         తెలియదు - చెప్పింది వినరు

   శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వైపు గాక వేదాలు, పురాణాలు, ఇతిహాసాల వైపు చూసే సిద్ధాంతం గల బిజెపి కి, దానిని నడిపే ఆర్‌యస్‌యస్‌ కు శాస్త్రవేత్తలు చెప్పే మాటలు ఎక్కవు. వాళ్ల మూర్ఖత్వం వాళ్ళదే. లేకుంటే అమెరికా, బ్రిటన్‌, ఇతర దేశాల్లో సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తుంటే... ఇక్కడ ముందుగా ఇసుమంతైనా జాగ్రత్త పడ్డారా? ఆసుపత్రులు కట్టారా? బెడ్లు పెంచారా? ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్మించారా? అందరికంటే ముందే వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నామని కోతలు తప్ప...టీకా తయారు చేయడానికి కంపెనీలకు ఆర్థిక సహాయం చేశారా? దేశంలో టీకా తయారు చేస్తున్న కంపెనీలకు బయానా ఇచ్చి వ్యాక్సిన్లు బుక్‌ చేశారా? ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం ఎదుర్కోడానికి అన్ని దేశాలు ఏం చేస్తున్నాయో కూడా చూడరా? చైనాను చూడకపోయినా మోడీ మిత్ర దేశాలు చేస్తున్నది కూడా చూడరా? తనకు తెలియదు. శాస్త్రవేత్తలు చెప్పింది వినరు. ఇదే గదా మూర్ఖ శిఖామణి లక్షణం.
 

                                                  స్వప్రయోజనం కోసం కరోనా పట్ల నిర్లక్ష్యం

   జనం చచ్చినా, దేశం అథోగతిపాలైనా ఎన్నికల్లో నెగ్గడం ఎలా? తన కార్పొరేట్‌ మిత్రులకు లాభం చేకూర్చడం ఎలా? అందుకు అనుగుణంగా చట్టాలు చేయడం ఎలా? ఆ చట్టాలను వ్యతిరేకించే ఉద్యమాలను అణచివేయడం ఎలా అని ఒక వైపు. మరో వైపు ప్రజలను మూఢులుగా, మతోన్మాదులుగా మార్చేందుకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే గుడులు నిర్మించడం, కుంభమేళాలకు అనుమతించడం వంటి పనులు చేసింది. ఆపైన ప్రజలను మతాలుగా, కులాలుగా, ఉపకులాలుగా, జాతులుగా, ఉపజాతులుగా విభజించి ఒకరిపై ఒకరిని ఎగదోసి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రలే గత సంవత్సరమంతా బిజెపి ప్రభుత్వం చేసింది. కరోనా నుండి దేశాన్ని, ప్రజలను కాపాడే తీరికే లేకుండా ఈ విధ్వంసకర పనులే మోడీ ప్రభుత్వం చేసింది.
 

                                                    భ్రమలు కరిగి వాస్తవం ఆవిష్కృతం

   మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్‌ వర్గాల మద్దతు ఉన్నందున, ఆ కార్పొరేట్ల చేతుల్లోనే మీడియా అంతా ఉండటంతో కరోనా నియంత్రణలో మోడీ ప్రభుత్వ వైఫల్యం కప్పిపెట్టే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెరిగిపోయిన కరోనాను దాచడం, దాని ఫలితంగా పెరిగిన రోగులను దాచడం, ఆక్సిజన్‌ లేక, బెడ్లు లేక, మందులు లేక రోడ్డు మీదే వేలకు వేలు ప్రజలు మరణించడం సోషల్‌ మీడియా నుండి, విదేశీ మీడియా నుండి దాచేయడం సాధ్యం కాలేదు. మోడీ ప్రభుత్వ అసమర్థతను కరోనా బట్టబయలు చేసింది. మోడీ గజకర్ణ గోకర్ణ, టక్కు టమారాలు, వాగాడంబరంతో ప్రపంచంపై సృష్టించిన భ్రమలు కరిగిపోయి వాస్తవ భారత దేశం ఆవిష్కృతం అవుతున్నది.
 

                                            ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి

   భారత దేశ ప్రజలు త్వరగానే బిజెపి ప్రభుత్వ మోసాలను అర్థం చేసుకుంటున్నారు. కాకుంటే రాజకీయాల్లో ఉండే సంక్లిష్టతను అర్థం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. కరోనా నియంత్రణకు ఎవరికి వారు వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. కనుక మోడీ ప్రభుత్వంపై ప్రజలంతా ఒత్తిడి పెంచి దేశాన్ని, అందులో భాగంగా తమను రక్షించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత నుండి తప్పుకోలేవు.
 

(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)

ఎం. కృష్ణమూర్తి

ఎం. కృష్ణమూర్తి