May 17,2022 06:52

      మారు నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే పలకరిస్తాయన్న వార్తలతో ఆశాజనకంగా ఖరీఫ్‌నకు సన్నద్ధమవుతున్న రైతన్నలను ఆదిలోనే విత్తనాల ధరలు ఠారెత్తిస్తున్నాయి. తొలకరి వానలు పడగానే సేద్యం చేపట్టాలంటే తక్షణం కావాల్సినవి విత్తనాలే. ఆ పంట ఈ పంట ఆ రకం ఈ రకం అనే తేడా లేకుండా సమస్త విత్తనాల ధరలూ నిరుటి కంటే కనిష్టంగా 20 శాతం గరిష్టంగా వంద శాతం పెరిగాయి. ధర పెట్టినా విత్తనం దొరకని పరిస్థితి. బ్లాక్‌ మార్కెటింగ్‌ చెప్పనలవి కాదు. ఈ వైపరీత్యానికి ప్రధాన హేతువు డీజిల్‌, పెట్రోలు ధరల విచ్చలవిడి పెంపుదల. పెట్రో ఛార్జీలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చలవే. కాబట్టి అన్నదాతలపై విత్తన ధరల భారం మోపింది మోడీ సర్కారేనన్నది నిస్సందేహం. ఇదే అదనుగా కార్పొరేట్‌ సీడ్‌ కంపెనీలు ఇష్టారీతిన రేట్లు పెంచి రైతును దోచుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వలన కొన్ని పంట విత్తనాల ధరలు పెరిగాయన్న వాదనలు అంతగా నప్పేవి కావు. ధరలు పెంచి దోచుకునేందుకు సమయానుకూలంగా ఎంచుకున్న ఒకానొక కారణంగానే పరిగణించాలి. కార్పొరేట్ల కోసం పరితపిస్తున్న మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరల నియంత్రణకు పూనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్దిష్ట చర్యలు చేపట్టడం లేదు. తుదకు రైతు దోపిడీకి గురవుతున్నాడు.
     రైతులకు నాణ్యమైన విత్తనాలను అదనుకు అందుబాటులో ఉంచితేనే సేద్యం సజావుగా సాగుతుంది. దశాబ్దాలుగా ఈ కనీస బాధ్యతను ప్రభుత్వాలు నెరవేర్చడం లేదు. రైతులకు రాయితీపై అందించే విత్తనాల పరిమాణం చాలా తక్కువ. అవసరంలో 20 శాతం కూడా లేదు. అదీ కొన్ని పంటలకే పరిమితం. రాను రాను అది కూడా తగ్గిపోతోంది. ప్రధాన కారణం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో కోతలు. ఉదాహరణకు నూనెగింజల అభివృద్ధి పథకంలో భాగంగా గతంలో ఐదారు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై అందించగా ఈ ఏడాది మూడున్నర లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. ఆహార భద్రతా మిషన్‌, పప్పు దినుసుల అభివృద్ధి, చిరుధాన్యాలకు ప్రోత్సాహం, సీడ్‌ విలేజి ప్రోగ్రాం వంటి పథకాలూ ఇలాగే కునారిల్లుతున్నాయి. కేంద్ర పథకాల నిధులను రాష్ట్రం వేరే వ్యాపకాలకు మళ్లిస్తోందన్న సాకు చెప్పి కేంద్రం నిధుల కోతలకు పాల్పడుతోంది. సబ్సిడీ విత్తనాల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో 2019-20లో రూ.200 కోట్లు ప్రతిపాదించి 186 కోట్లు ఖర్చు చేశారు. 2020-21లో 181 కోట్లు ఖర్చు చేశారు. 2021-22లోనూ అదే తీరు. ఖరీఫ్‌, రబీ కలుపుకొని పది లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాలనుకోగా ఏడెనిమిది లక్షల క్వింటాళ్లు గగనమవుతోంది. విపత్తుల సమయంలో ప్రత్యేకంగా 80 శాతం సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు సైతం అంతే. సర్కారీ రాయితీ విత్తనాలు తగ్గిపోతూ ఉంటే, ఎ.పి సీడ్స్‌ నిర్వీర్యమైపోతూ ప్రైవేటుపైనే ఆధారపడుతుంటే, రిసెర్చ్‌కు నిధులు లేకపోతుంటే, విత్తనాలపై సరైన నియంత్రణ లేకుంటే, లాభాల కోసమే ఉన్న కార్పొరేట్‌, ప్రైవేటు సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? రైతు మూలగను జుర్రుకుంటున్నాయి.
     రాష్ట్రంలో నాణ్యతలేని, కల్తీ, నకిలీ విత్తనాలకు కొదవే లేదు. అనుమతుల్లేని బిటి-3 పత్తి విత్తనాలు యథేచ్ఛగా డోర్‌ డెలివరీ అవుతున్నాయి. నిరుడు కల్తీ పత్తి, మిర్చి విత్తనాల వలన రైతులు నష్టపోగా ఇప్పటికీ పరిహారం లేదు. రైతులను నిలువునా మోసం చేసిన కంపెనీలు చట్టాల్లోని లొసుగులతో పరిహారం ఎగ్గొడుతుండగా, పలు సందర్భాల్లో ప్రభుత్వం బాధిత రైతుల పక్షాన కాకుండా కంపెనీలకు వత్తాసు పలుకుతోంది. ఎ.పి సీడ్స్‌ సరఫరా చేసిన విత్తనాలే నాసిరకం అని తేలిన ఉదంతాలున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యతా పరీక్షలు, తనిఖీలు, నిఘా అంటున్నా అక్రమాలు ఆగింది లేదు. విత్తన కంపెనీల దోపిడీ, అక్రమాలు ఆగాలంటే సమగ్ర విత్తన చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కార్పొరేట్ల లాభాలే పరమావధిగా పని చేస్తున్న మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించే స్థితిలో లేదు. రైతుల పక్షపాతమని చెప్పుకునే రాష్ట్ర సర్కారు తన పరిధిలో విత్తన చట్టం తేవడంపై మీనమేషాలు లెక్కిస్తోంది. రైతాంగం ఉద్యమించి సాధించుకోవాలి.