
గత సంవత్సరం మిర్చి ఆరబోసిన పాత తెల్ల పట్టాలతో గుడారాలు వేసుకుంటారు. ఉదయం 7 గంటలకు కాయ కోతకెళితే....తిరిగి రాత్రి 7 గంటలకు గుడారానికి చేరుకుంటారు. కోసిన కాయలను కాటా వేసి, కల్లంలో ఆరబోసి పురుషులు 8 గంటలకు వస్తారు. చుట్టూ చిమ్మ చీకటి, రైతులు పరిమితంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బుల వెలుతురులో పని నుండి వచ్చి వంట చేసుకుని తిని అక్కడే పడుకుంటారు. పొరపాటున కరెంటు పోతే ఇక అంధకారమే. విష పురుగులు, పాములతో సహజీవనం చేస్తున్నారు. వర్షం పడితే వారి పరిస్థితి మరింత దయనీయం.
దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రకాశం జిల్లా వలస కార్మికులు కనిపిస్తారు. అయితే అనేక రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి ప్రకాశం జిల్లాకు పెద్ద సంఖ్యలో వలసలు రావటం విచిత్రమే. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులతోపాటు, వరి, పత్తి, బార్లీ, పొగాకు, శనగ లాంటి పంటల్లో వస్తున్న నష్టాల వల్ల క్రమంగా గత ఐదారేళ్ళ నుండి మిర్చి పంట వేయటం జిల్లాలో బాగా పెరిగింది. ఒకప్పుడు 50-60 వేల ఎకరాల్లో వేసేది నేడు లక్ష నుండి 1.30 లక్షల ఎకరాలకు పెరిగింది. మిర్చి పంట కోతకు వచ్చాక వీలైనంత తొందరగా కోయాలి. లేకపోతే కాయలు రాలిపోయి రైతుకు నష్టం వస్తుంది. అందువలన తక్కువ కాలంలో ఎక్కువ మందితో కోత కోయాల్సి వుంటుంది. గత నాలుగైదేళ్ళ నుండి 50-60 కి.మీ. దూరం కూడా కూలీలు జిల్లాలోనే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఏరోజుకారోజు ఆటోల్లో వెళ్ళి కోత కోసి వస్తున్నారు. పంట విస్తీర్ణం క్రమంగా పెరగటంతో స్థానిక వలసలు చాలక ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రావటం బాగా పెరిగింది. జిల్లాలో నీటి వసతి వున్న మండలాలైన నాగులుప్పలపాడు, ఇంకొల్లు, పర్చూరు, కారంచేడు, కొరిశపాడు, పంగులూరు ప్రాంతాల్లో విస్తీర్ణం చాలా ఎక్కువగా వుంది. ఈ ప్రాంతానికి గత మూడు నాలుగేళ్ళ నుండి బయటి జిల్లాల నుండి వలస వచ్చేవారి సంఖ్య 10 వేల నుండి 15 వేల దాకా వుంటున్నది. వీరంతా జనవరి 20 నుండి ఏప్రియల్ ఆఖరు వరకు పొలాల్లోనే గుడారాలు వేసుకుని పని పూర్తయ్యేవరకు అక్కడే నివాసం వుంటారు.
దుర్భర జీవితాలు
ఇంకొల్లు మండలం వంకాయలపాడుకు కర్ణాటక రాష్ట్రంలోని రారుచూర్, కర్నూల్ జిల్లా ఆదోని మండలం నుండి 500 మంది వచ్చారు. వీరిలో ఎక్కువమంది దళితులు, గిరిజనులు. పూసపాడు, నూతలపాడు, దగ్గుబాడు, రెడ్డిపాలెం, దుద్దుకూరు తదితర గ్రామాలకు వెయ్యి మందికి పైగా వచ్చారు. గత సంవత్సరం మిర్చి ఆరబోసిన పాత తెల్ల పట్టాలతో గుడారాలు వేసుకుంటారు. ఆరుగురు సభ్యులున్న కుటుంబాలు (పిల్లలతో కలిపి) కూడా వచ్చాయి. ఉదయం 5 గంటలకు లేచి ఇంటి పనులు పూర్తి చేసుకొని 7 గంటలకు కాయ కోతకు వెళితే....తిరిగి రాత్రి 7 గంటలకు గుడారానికి చేరుకుంటారు. కోసిన కాయలను కాటా వేసి, కల్లంలో ఆరబోసి పురుషులు 8 గంటలకు వస్తారు. చుట్టూ చిమ్మ చీకటి, రైతులు పరిమితంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బుల వెలుతురులో పని నుండి వచ్చి వంట చేసుకుని తిని అక్కడే పడుకుంటారు. పొరపాటున కరెంటు పోతే ఇక అంధకారమే. విష పురుగులు, పాములతో సహజీవనం చేస్తున్నారు. వర్షం పడితే వారి పరిస్థితి మరింత దయనీయం. వాడుకునేందుకు పక్కనున్న చెరువు నుండి నీరు తెచ్చుకుంటున్నారు. మంచినీరు మాత్రం రైతులు ఒక బబుల్ ఇస్తున్నారని చెప్పారు. సమీపంలో వున్న నీటి కుంట దగ్గర తారు రోడ్డు మీద బట్టలు ఉతుక్కుంటున్నారు. అనారోగ్యానికి గురైతే గ్రామంలో వున్న చిల్లర కొట్టులో లభించే మందుబిళ్లలే గతి. స్త్రీ, పురుషులంతా ఆరుబయట బహిర్భూమికి వెళతారు. చిరిగిపోయిన తెల్లపట్టా ముక్కలతో మహిళలు స్నానానికి తాత్కాలిక దడులు కట్టుకున్నారు. 3 సంవత్సరాల పసిబిడ్డలతోపాటు, 70 ఏళ్ల వృద్ధులు కూడా వీరితోనే వున్నారు.
ఎందుకు వలస వస్తున్నారు ?
వారి సొంత గ్రామాల్లో పూర్తిగా వర్షాధార పంటలే. వ్యవసాయ పనులు, వేతనాలు బాగా తక్కువ. ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస వేతనాలు ఏనాడు రాలేదని అంటున్నారు. ఎకరం, రెండెకరాలు భూమి వున్న వాళ్లు నీటి కోసం బోర్లు వేసి నీరు పడక వ్యవసాయంలో అప్పు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులతో గతిలేని స్థితి లోనే పనుల కోసం ఎంత దూరమైనా వలస వస్తున్నామని చెప్పారు.
భద్రత కరువు
పనికి వెళ్ళిన సమయంలో గుడారాల దగ్గర ఎవరూ ఉండే అవకాశం లేదు. ఇదే అదునుగా కొందరు అందిన కాడికి దోచుకుని పోవటం మరింత విచారకరం. కూలి డబ్బులు కొంత బట్వాడ తీసుకొని సరుకులు తెచ్చుకుంటారు. తాము దాచుకున్న రూ.18,500 దొంగలెత్తుకెళ్ళారని నంద్యాల మండలం ''కపటి'' గ్రామం నుండి వచ్చిన 30 కుటుంబాలు వారు చెప్పారు. పోలీసులకు, తాము పనిచేస్తున్న రైతులకు చెప్పినా ఏం ఫలితం కనిపించలేదని వాపోయారు.
స్టోర్ బియ్యం రూ.15
'ఈ రోజుల్లో స్టోర్ బియ్యం ఎవరండీ తినేది?' అనే మాట ఎక్కువగా వింటుంటాం. కానీ వీరికి ప్రభుత్వం స్టోర్ బియ్యం సొంతూరులో ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఇస్తుంది. అవి చాలక గ్రామంలో స్టోర్ బియ్యం తినని వారి దగ్గర కిలో 15 రూపాయలకు తెచ్చుకుని తింటున్నారు. ఆ పొలాల నుండి మిర్చి తెచ్చుకుని, టమోటాలతో పచ్చడి చేసుకుంటున్నారు. అదే వారి ప్రధాన ఆహారం. కొందరు తమ గ్రామాల నుండి తెచ్చుకున్న సజ్జలు, గోధుమ పిండితో రొట్టె చేసుకుని తింటున్నారు. పండు మిర్చి ఉల్లిపాయతో తయారు చేసుకునే రుద్దుడు కారం అందరికీ కామన్ వంటకంగా కనిపించింది.
ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి
రోజుకి 12 గంటలు బాగా కష్టపడి పని చేస్తే 80 నుండి వంద కేజీలు కాయలు కోస్తారు. కేజీకి రూ.6 చొప్పున రూ. 500-600 వేతనం వస్తుంది. తీవ్రమైన ఎండల్లో అన్ని గంటల పాటు యంత్రాల్లా పని చేసి, తగిన నీళ్లు తాగక, పోషకాహారం తీసుకోక, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాలతో తీవ్రమైన అనారోగ్యాలకు గురౌతున్నారు. ఆదాయం వస్తుందని ఆనందించే లోపే అనారోగ్యం పాలౌతున్నారు. ఈ రోగాలకు కారణం తమ రాత, ఖర్మ అని కాలం వెళ్ళదీస్తున్నారు. సొంతూరులో చూసేవారు లేక, ఇక్కడ గుడారాల్లో వదిలేయలేక పసిబిడ్డలను సైతం తమతో ఎండకు తీసుకెళుతున్న వారి పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతుంది.
రక్షణ కల్పించే చట్టం కావాలి
ప్రభుత్వాలు వలస కూలీల రక్షణకు ఒక ప్రత్యేక చట్టం చేయాలి. వారికి పని ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలి. వాడుక నీటి వసతి, రక్షిత మంచినీరు అందించాలి. ఒక వైద్య బృందాన్ని ఏర్పాటుచేసి ఆరోగ్యపరమైన కనీస చర్యలు చేపట్టి మందులు అందించాలి. ఆయా గ్రామాల్లోని ఆరోగ్య కార్యక్తలు వీరికి కూడా వైద్య సలహాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీరి పిల్లలకు ఆ మూడు నెలల పాటు అవకాశం కల్పించాలి. వీరికి ఒక ఆయాను ఏర్పాటుచేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకులు వలస వచ్చినవారికి అదనంగా అందించాలి. కనీస వేతన చట్టం ప్రకారం 6 గంటల పనికి రూ.600 కూలి ఇవ్వాలి. ఆ తరువాత పనికి ప్రతి గంటకూ రెట్టింపు కూలి ఇవ్వాలి. ఆ ప్రకారం చూస్తే వీరు చేస్తున్న పనికి రోజుకు కనీసం రూ.1800 ఇవ్వాలి. చట్టాల గురించి వీరికి తెలియదు, ప్రభుత్వాలు ఏనాడూ వాటి గురించి చెప్పవు. వ్యవసాయ కార్మిక సంఘాల వంటివి వారికి ఈ విషయాలు చెప్పి కొంతమేరకు చైతన్యపరుస్తున్నాయి. చైతన్యం తోనే వేతనాలు పెంపు, సౌకర్యాలు, చట్టాలు సాధించుకోగలుగుతాం.
/ వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి, సెల్ : 94903 00370 /
కంకణాల ఆంజనేయులు