Feb 18,2021 20:39

బెంగుళూరుకు చెందిన 21 ఏళ్ల రమితా రాథోడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల దుస్థితికి సాక్ష్యంగా ఒక డాక్యుమెంటరీ చేసింది. తన ఫొటోగ్రఫీ నైపుణ్యాన్నంతా ఉపయోగించి నిర్మించిన 'లాస్ట్‌ ఇన్‌ ట్రాన్సాక్షన్స్‌' (పని కోల్పోవడం) ఫొటో డాక్యుమెంటరీకి అమెరికాకు చెందిన గ్రేటర్‌ గుడ్‌ ఛారిటీస్‌ నుంచి 'గర్ల్స్‌ వాయిస్‌ ఫర్‌ ఛేంజ్‌ 2020' అవార్డు అందుకుంది.
రమిత కుటుంబంతో కలిసి కబిని (కేరళ-కర్ణాటక)లో ఉంటోంది. 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై ఆసక్తి ఏర్పడింది. తన తండ్రి వద్ద ఉన్న కానన్‌ 1100డి కెమెరాతో ప్రయోగాలు చేసేది. ఆమెకు ఫొటోల ద్వారా కథలు చెప్పడమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రమిత పెర్ల్‌ అకాడమీ ముంబై క్యాంపస్‌లోని స్కూల్‌ ఆఫ్‌ కాంటెంపరరీ మీడియా నుంచి ప్రొఫెనల్‌ ఫొటోగ్రఫీలో సర్టిఫికెట్‌ పొందింది.
గతేడాది వేలాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయి తమను తాము ఒంటరివారిగా భావించారు. అనిశ్చిత భవిష్యత్తులో చిక్కుకున్నారు. గ్రామాల్లో ఉన్న తమ కుటుంబాల గురించి బాధపడ్డారు, భయపడ్డారు. రమిత తల్లి సఫల్‌ అనే ఎన్‌జిఒ ద్వారా లాక్‌డౌన్‌ సమయంలో స్వగ్రామాలకు వెళ్లలేని కార్మికులకు రేషన్‌కిట్లను పంపిణీ చేసింది. రమిత కూడా ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేయాలనుకుంది. వలస కార్మికుల ముఖంలో ప్రతిబింబిస్తున్న బాధను, వారి దీనగాథను కెమెరా లెన్స్‌ ద్వారా ప్రపంచానికి చెప్పాలనుకుంది. 'లాస్ట్‌ ఇన్‌ ట్రాన్సాక్షన్‌' పేరుతో ఫొటో డాక్యుమెంటరీ చేసింది. ఇదే ఇప్పుడు రమితకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది.
మొదట్లో రమితకు వారి గురించి తెలుసుకోవడం పెద్ద సవాలుగా మారింది. వారు తమ అనుభవాలను పంచుకోవడానికి వెనుకాడేవారు. ప్రతిరోజూ కోవిడ్‌-19 కేసులు పెరుగుతూ ఉండడం వల్ల తన కుటుంబం రమిత గురించి ఆందోళన చెందింది. వృద్ధురాలైన రమిత నానమ్మ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. ప్రారంభంలో కొంత ప్రతిఘటించినప్పటికీ, షూట్‌ సమయంలో కుటుంబం సహకారమూ లభించింది. పోలీసులు కూడా ప్రాజెక్ట్‌ సమయంలో సహకరించారు.
''నేను సేకరించిన కథలను ప్రదర్శించడానికి అంతర్జాతీయ వేదిక దొరకటం చాలా సంతోషం కలిగించింది. వాస్తవానికి నేను కాంపిటేషన్‌లో ఉన్నానన్న విషయమే మర్చిపోయాను. ఫైనల్‌లిస్టులో ఉన్నానని ఈ-మెయిల్‌ వచ్చేవరకు నాకు ఆ విషయమే గుర్తులేదు'' అంటోంది. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌ కావాలనేది రమిత కల. ఫొటోగ్రఫీలో ఇతర పద్ధతులు, ఫ్యాషన్‌, ఆర్ట్‌ ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.
తమ విద్యలో అడ్డంకులను ఎదుర్కొంటున్న బాలికలకు స్కాలర్‌షిప్‌తో 'గ్రేటర్‌ గుడ్‌ ఛారిటీస్‌' సంస్థ అందించే మీడియా శిక్షణే 'గర్ల్స్‌ వాయిస్‌'. ప్రపంచంలోని అమ్మాయిలకు తమ సొంత కథలను వీడియో, ఫొటోల ద్వారా చెప్పడానికి 'గర్ల్స్‌ వాయిస్‌' అవకాశం ఇస్తోంది.