May 17,2022 01:02
  • సుప్రీం కోర్టులో ఒడిశా కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : ఒడిశా వైఖరితో నేరడి బ్యారేజీ అంశం ఇప్పట్లో తేలేటట్టు లేదని అభిప్రాయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మించి హిరమండలం రిజర్వాయర్‌ను నింపాలని యోచిస్తోంది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కోసం అధికారులు రెండు రకాల ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. గొట్టా బ్యారేజీలోనే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని నిర్మించి రిజర్వాయర్‌ను నింపాలన్నది మొదటి ప్రతిపాదన. ఇందుకు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వంశధార ఎడమ కాలువ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి రిజర్వాయర్‌లోకి నీరు ఎత్తిపోయాలన్నది రెండో ప్రతిపాదన. ఇందుకు రూ.200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారుల అంచనా. అధికారులు ఇప్పటికే స్థల పరిశీలన చేశారు.

  • ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగినా?

ఒడిశాతో ఉన్న వివాదాల పరిష్కారానికి గతేడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భువనేశ్వర్‌ వెళ్లి ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. వంశధారతోపాటు ఇతర సరిహద్దు అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల సిఎస్‌లు ఆన్‌లైన్‌లో ఒకసారి సమావేశమయ్యారు. అయినా, సమస్య పరిష్కారం కావడం లేదు. గతేడాది జూన్‌లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పి) ఉపసంహరించుకోకపోవడంతో ఆ కేసు విచారణలోనే ఉంది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలంటూ 2019లో ట్రిబ్యునల్‌ తుది తీర్పుపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ నడుస్తోంది. ఇది ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది.

  • తీర్పులు అనుకూలంగా ఉన్నా నెరవేరని 'నేరడి' కల

ట్రిబ్యునల్‌ తీర్పులు అనుకూలంగా ఉన్నా నేరడి బ్యారేజీ కల నెరవేరడం లేదు. నేరడి బ్యారేజీకి ఒడిశా అభ్యంతరాలు చెప్తోంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భామిని మండలం కాట్రగడ వద్ద సైడ్‌ వియర్‌ నిర్మాణానికి సిద్ధమవుతున్న తరుణంలో ట్రిబ్యునల్‌ను ఒడిశా ఆశ్రయించింది. సైడ్‌ వియర్‌ నిర్మించుకోవచ్చంటూ 2013లో ట్రిబ్యునల్‌ తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 పనులను ప్రారంభించింది. ఇరు రాష్ట్రాల సిఎంల చర్చల తర్వాత ఒడిశా ప్రభుత్వం నేరడికి అంగీకరిస్తుందని అంతా ఆశించినా సుప్రీం కోర్టులో కేసును ఉపసంహరించుకోలేదు. దీంతో, గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

  • ఎత్తిపోతలపై భిన్నాభిప్రాయాలు

ఎత్తిపోతల పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి ఏడాదికి రూ.20 కోట్ల కరెంట్‌ బిల్లు వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ భారమంతా రైతులపై పడే అవకాశం ఉంది. మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తోన్న 87, 88 ప్యాకేజీ పనులు, హిరమండలం రిజర్వాయరు పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పలు పర్యాయాలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించిన అనంతరం ఈ ఏడాది డిసెంబరు వరకు మరోసారి అవకాశమిచ్చారు. వీటి పూర్తికి తొలుత ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. అదీగాక గొట్టా బ్యారేజీ వద్ద 0.612 టిఎంసిల నీరే లభ్యమవుతుంది. వరదల సమయంలోనే రిజర్వాయర్‌ను నింపే అవకాశముంది. హిరమండలం రిజర్వాయర్‌ సామర్థ్యం 19 టిఎంసిలు నిండాలంటే ఆ మేరకు వరద నీరు రావాల్సి ఉంటుంది. కాట్రగడ సైడ్‌వియర్‌ వద్ద నిర్మించిన కాలువ ద్వారా కూడా వరదల సమయంలోనే రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. కొత్తగా ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై రైతులకు ఏవిధంగా ప్రయోజనం ఒనగూరుతుందో వేచి చూడాలి.

  • ప్రతిపాదనలు పంపిస్తున్నాం

ఒడిశా అభ్యంతరాలతో నేరడి మరింత జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నయంగా గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మించి రిజర్వాయర్‌ను నీటితో నింపేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతాం.
ాడోల తిరుమలరావు, వంశధార ప్రాజెక్టు ఎస్‌ఇ