Oct 17,2020 19:59

కృష్ణా (అవనిగడ్డ) : అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, పామర్రు శాసన సభ్యులు కైలే అనిల్‌ కుమార్‌ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. పులిగడ్డ అక్విడెక్ట్‌, వసుమట్ల, స్థానిక గర్ల్స్‌ హైస్కూల్‌లో పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజి నుంచి తొమ్మిది లక్షలకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక్కరికి కూడా ప్రాణహాని జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగితే ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
ముంపు ప్రాంతాల పరిశీలన
నాగాయలంక : కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమండి దీవులలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని జిల్లా కలెక్టర్‌ ఎండి ఇంతియాజ్‌ జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ మాధవిలత అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పర్యటించి వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు ఎదురుమండి దీవులలోని ఎదురుమండి నాచుగుంట లోతదితర ప్రాంతాల్లో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పర్యటించి ఆయా గ్రామాల ప్రజలను సమావేశపరిచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగాయలంక నుండి ఎదురుమండి దీవులకు వెళ్లాలంటే కృష్ణా నదిలో ప్రయాణం చేయవలసి వస్తుందని తెలుపుతూ కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి ఇప్పటికే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పందించి కొన్ని పనులకు ఆమోదం తెలిపారని చెప్పారు. అనంతరం బైక్‌పై ఆయా ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలను, ముంపుకు గురైన చెరువులను పరిశీలించారు.