Dec 02,2022 00:12

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

-ఇళ్ల పునర్నిర్మాణంలో ఫారెస్ట్‌ అధికారుల వేధింపులు సరికాదు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం
ప్రజాశక్తి-విఆర్‌.పురం

గోదావరి వరదల్లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్‌ చేశారు. రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో కుంజా సీతారామయ్య అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల వలన నాలుగు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు సహాయం అందించడంలో విఫలమైన ప్రభుత్వం, పంట నష్టాన్ని కూడా తగ్గించి చూపడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. గోదావరి వరదలకు సర్వం కోల్పోయి కొండలు గుట్టలలో నెలలు తరబడి తలదాచుకున్న ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం వేచి చూశారని, ముఖ్యమంత్రి జగన్‌ చింతూరు పర్యటనలో రూ.10వేల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. నాలుగు నెలలైనా ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అందించిన వరి సబ్సిడీ విత్తనాలు వలన నేటికీ గింజలు రావడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఇంత నష్టం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పడిపోయిన ఇళ్లను తిరిగి నిర్మించుకోడానికి కలప తెచ్చేకోవడాన్ని అటవీ అధికారులు అడ్డుకోవడం సరికాదని, ఫారెస్ట్‌ అధికారుల నిర్బంధాలను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా కమిటీ సభ్యులు ఐవి, పూనెం సత్యనారాయణ, మేకల నాగేశ్వరరావు, సీసం సురేష్‌, నాయకులు పాయం సీతారామయ్య, సోయం చినబాబు, పల్లపు వెంకట్‌, పులుసు బాలకృష్ణ, పులి సంతోష్‌ పాల్గొన్నారు.