Jul 28,2021 23:41

కర్లపాలెంలో పొలాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి-కర్లపాలెం : వరి నారుమడుల్లో ఇనుముధాతు లోపాలను గుర్తించామని జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ శివన్నారాయణ పేర్కొన్నారు. మండలంలో పొలాలను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వరి నారుమడుల్లో లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది (ఐరన్‌ సల్ఫేట్‌)ను 2 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలని చెప్పారు. శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.నగేష్‌ మాట్లాడుతూ నారుమడి దశలో ఉల్లికోడు సోకినట్లు అనిపిస్తే ఎకరాకు 20 కిలోల 3జి గుళికలను వేసుకోవాలన్నారు. ఇతర తెగుళ్ల నివారణపైనా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బాపట్ల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, బాపట్ల డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ.లక్ష్మీ, ఏవో కె.అరవిందకుమార్‌, ఇ.భ్రమరంభాదేవి పాల్గొన్నారు.
రైతుభరోసా కేంద్రాల సిబ్బందికి శిక్షణ
ప్రజాశక్తి - క్రోసూరు : బెల్లంకొండ, రాజుపాలెం, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని వ్యవసాయ, ఉద్యాన శాఖల గ్రామస్థాయి సిబ్బందికి క్రోసూరులో సామర్థ్య పెంపు శిక్షణిచ్చారు. పొలంబడి, గ్రామీణ విత్తనోత్పత్తి పథకం, జాతీయ ఆహార భద్రతా పథకం, చిరు సంచులు ఈ-క్రాప్‌ బుకింగ్‌, ఇతర పథకాలపై క్రోసూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతరావు వివరించారు. పంటల ఈ-క్రాప్‌ బుకింగ్‌ తప్పనిసరని, రైతులు తమ ఆధార్‌ కార్డు, పొలం పాస్‌బుక్‌, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఏవోలు నరసింహారావు, డి.కృష్ణయ్య, సుగుణ బేగం, రామమ్మ పాల్గొన్నారు.