Apr 20,2023 08:02
  • జీ-20 సదస్సు పేరుతో సర్వాంగసుందరంగా వారణాసి
  • అయినా దుర్భరంగానే పేదల బతుకులు

వారణాసి : జీ-20 సదస్సు సందర్భంగా వారణాసి నగరంలోని వీధుల్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన అతిథుల్ని ఆకట్టుకునేందుకు చేయాల్సిందంతా చేశారు. రోడ్లన్నీ తళతళలాడుతున్నాయి. అయితే ప్రతి రోజూ ఇలా ఎందుకు ఉండడం లేదని వారణాసి మురికివాడల్లో నివసిస్తున్న ప్రజానీకం వేస్తున్న ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
జీ-20 సమావేశాల నేపథ్యంలో వారణాసిని అందంగా అలంకరించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే...ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలింది. చెట్లు, వంతెనలకు సైతం రంగులు వేశారు. మురికివాడలు కన్పించకుండా ఆకుపచ్చని పరదాలు కట్టారు. పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. మొత్తానికి అతిథులకు రోడ్డు పక్కన గుడిసెలు కన్పించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి వారణాసిలో మూడింట రెండో వంతు ప్రాంతం మురికి వాడలు, పూరి గుడిసెలతోనే నిండి ఉంటుంది. పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీలు గుప్పించే నేతలు ఇప్పుడు పేదరికం బయటకు కనబడకుండా మభ్యపెడుతున్నారు. ఆకుపచ్చని పరదాల చాటున నిజాలను ఎందుకు కప్పిపెడుతున్నారని మురికి వాడల ప్రజలు నిలదీస్తున్నారు. ఇంతకుముందు నగరాన్ని ఇలా ఎందుకు శుభ్రం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. రాత్రింబవళ్లూ డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ దుర్గంధం వెదజల్లుతున్న ప్రాంతంలో నివసిస్తున్న గుడియా అనే మహిళ మాట్లాడుతూ ''మురికివాడలు కన్పిస్తే చాలు...బుల్‌డోజర్లు వచ్చి నేలమట్టం చేస్తున్నాయని'' వాపోయారు. పేదరికం కానీ, పేదలు కానీ అతిథులకు కన్పించకుండా చేస్తున్నారని చెప్పారు. పిల్లలు, వృద్ధులకు రోజుకు రెండు పూటలా ఆహారం దొరకడం కూడా దుర్భరం అవుతోందని, అయినా ఎవరికీ పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజ్వానా అనే మరో మహిళ మాట్లాడుతూ 'నాకు వివాహమై పదేళ్లు అయింది. నగరాన్ని ఇంత సుందరంగా ఎప్పుడూ చూడలేదు. అంతా కృత్రిమంగా కన్పిస్తోంది. బీజేపీ వాళ్లు ఓట్ల కోసమే మా ప్రాంతానికి వచ్చే వారు. ఇప్పుడు రాత్రికి రాత్రే చెత్తాచెదారాన్ని తొలగించారు. ఆకుపచ్చని లాన్లు ఏర్పాటు చేశారు. ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు, నెమళ్లు, చివరికి సీతాకోక చిలుకల బొమ్మల్ని కూడా ఏర్పాటు చేశారు. వావ్‌...ఎప్పుడూ ఇలా ఉంటే ఎంత బాగుండు' అని అన్నారు.
రాజ్‌ఘాట్‌ సమీపంలోని మురికి వాడలో నివసిస్తున్న అజరు గోండ్‌ది మరో వ్యథ. ఆ ప్రాంతంలోని ఇళ్లను కూల్చేస్తామని ఉత్తర రైల్వే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కూల్చేస్తే తమ ప్రపంచమే నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటిపన్ను, నీటిపన్ను, కరెంటు బిల్లులు కడుతున్నా తమకు ఎందుకీ దుస్థితి అని నిలదీశారు.
అతిథులను సంతృప్తి పరచడం కోసం తమ బతుకులను నాశనం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడానికి బదులు పేదల్ని నిర్మూలించాలని చూస్తోందని జర్నలిస్ట్‌ ప్రదీప్‌ కుమార్‌ చెప్పారు. జీ-20 సమావేశాల కోసం చేసిన కోట్లాది రూపాయల ఖర్చుతో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చని అన్నారు. ప్రస్తుత వ్యవస్థలో మురికివాడల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. మరోవైపు సామాన్య ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయని తెలిపారు. గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన వాస్తవాలు దాగవని అన్నారు. సమావేశాల కోసం చేసిన వ్యయం విషయంలో పారదర్శకత లోపించిందని సర్వధర్మ సంఫ్‌ు డైరెక్టర్‌ రామ్‌ధిన్‌ విమర్శించారు. సమావేశాల కోసం తమ భూమిని కూడా లాక్కునేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పారు.
వారణాసిలోని పలు ప్రాంతాలలో జీ-20 లోగోలను ప్రదర్శించారు. వీటితో పాటు బీజేపీ ఎన్నికల గుర్తు కమలం కూడా దర్శనమిచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా పాలకులు పట్టించుకోలేదు. లోగోలో చూపిన 'వసుదైక కుటుంబం' భావన ఆచరణలో ఎక్కడా కన్పించలేదు.