Dec 02,2021 02:44

వాతావరణ శాఖ విడుదల చేసిన మ్యాప్‌

ప్రజాశక్తి -గ్రేటర్‌ విశాఖ బ్యూరో
ఈనెల 2న ఏర్పడనున్న వాయుగుండం మరింతగా బలపడి 3వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో తుపాను మారునున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రాత్రి వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం... డిసెంబర్‌ 3 నాటికి తుఫానుగా బలపడి వాయువ్య దిశగా కదిలి, మరింత బలపడి డిసెంబర్‌ 4 ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, డిసెంబర్‌ 3న శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం, తూర్పు, గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4న శ్రీకాకుళం విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3, 4 తేదీల్లో తీరం వెంబడి 80-90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కావున ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, 3, 4 5 తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రైతులు కాపాడుకోవాలని వాటిని సురక్షితంగా ఉంచాలని కోరారు.
తుపానుపై సిద్ధంగా ఉండాలి : కలెక్టర్‌
తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్‌ హెచ్చరికలతో ఆయన బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో పోలీస్‌ కమిషనర్‌తో కలిసి ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్‌ అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఇంజనీరింగ్‌ శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నౌకాదళ, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు ఇప్పటి నుండే తయారుగా ఉండాలన్నారు. వరి పంటకు సంబంధించి శాస్త్రవేత్తల సూచినలను రైతులకు చేరవేయాలన్నారు. తీరప్రాంతాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా మాట్లాడుతూ చిన్న సంఘటన జరిగినా కంట్రోల్‌ రూమ్‌లకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌పి బి.కృష్ణారావు, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి పి.అరుణ్‌ బాబు, డిఆర్‌వో శ్రీనివాసమూర్తి, వ్యవసాయ, పశుసంవర్థక, విద్యుత్‌, అగ్నిమాపక, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఆర్‌ అండ్‌ బి, పిఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు