May 16,2022 07:31

తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సరికొత్త రూపాన్ని సంతరించుకుని జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి నానీలు. తక్కువ అక్షరాలతో అనంత అర్థాన్ని స్ఫురింపజేస్తూ పాఠకుల మదిని దోచుకుంటున్నాయి. చదివేకొద్దీ చదవాలనిపిస్తూ పిల్లలకి కూడా అర్థమయ్యే రీతిలో స్పష్టంగా, సంక్షిప్తంగా ఉండేవే నానీలు. బోజంకి వెంకట రవి అందంగా భావ వ్యక్తీకరణ చేయగల కవి. చిన్నారుల ఈతిబాధలు, రైతన్నల వెతలు, కుటుంబ బంధాలు, పేదల ఆకలి కేకలు, పండుగ విశిష్టతలు... ఇలా అనేకానేక అంశాలను నానీలుగా రూపొందిస్తున్నారు. తాజాగా 'వాన కోయిల' పేరిట ఓ సంపుటిని వెలువరించారు.
    ఒకే ఒక్క/ పలకరింపుతో/ పులకరింపును/ మోసుకొచ్చేది జాబు./ అంటూ పలకరింపు నానీతో ఈ సంపుటి మొదలైంది. ఈ నానీలో 'ఉత్తరం' గొప్పతనం గురించి చక్కగా చెప్పారు. ఉత్తరాలతోనే ప్రేమ, ఆప్యాయతలు తొణికిసలాడేవి ఒకప్పుడు. జీవిత పరిధి/ చిన్నదే కావచ్చును/ ఆశయం పరిధి/ అనంతమైనది./ అంటే క్షణికమైన ఈ జీవన పయనంలో కోపతాపాలకు తావివ్వకుండా అనంతమైన ఆశయసాధనకు ముందుకు సాగుతూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చక్కని ఉపమానాన్ని ఇచ్చారు. చెట్టును కోల్పోయిన/ గూడు వంటిది/ నాన్న లేని/ కుటుంబం./ రవి గారు నాన్న పైన ఉన్న మమకారాన్నంతా రంగరించి మరీ ప్రజెంట్‌ చేశారు ఈ నానీలో. చెట్టు లేక పోతే పక్షి గూడు ఎలా చెల్లాచెదురు అయిపోతుందో నాన్నలేని కుటుంబం కూడా అలానే ఉంటుంది అని ఎంతో ఆవేదనగా చెప్పారు. అయినవారి కోసం/ కరిగి పోతాను/ కొవ్వొత్తి/ నా ఆదర్శం./ కొవ్వొత్తి తాను కరిగిపోతానని తెలిసి కూడా ఎంతో వెలుగును పంచుతుంది. అలాగే తాను కూడా అయిన వారి కోసం ఎంత కష్టాన్నయినా భరిస్తానని ఎంతో ఆనందంగా చెప్పారు కవి. చెల్లెలు/ మరో చల్లని చిన్నితల్లి/ కూతురు/ మరో కన్నతల్లి./ అంటూ కుటుంబ బంధాలకి చక్కని భాష్యం చెప్పారు కవి.
తారును/ జలతారుగా మార్చాడు/ మహాకవి అంటే/ అతడే./ రసాయన పదార్థంలా ఉండే కవిత్వాన్ని శ్రీశ్రీ వచ్చి జలతారుగా అంటే మెరుపుతీగలా, బంగారంలా మార్చి కవితా ప్రపంచానికి వన్నెతెచ్చిన మహాకవి అంటూ తారు, జలతారులతో పోల్చి చక్కని ఉపమానాన్ని ఇచ్చారు. పెంకితనం లేని/ పిల్లలు డొల్లలు/ పరమాత్ముడు ఇచ్చిన/ నిధుల ముల్లెలు./ అల్లరితోనే పిల్లల ఉల్లాసం, ఉత్సాహం ఉరకలు వేస్తుంది అంటారు కవి. అనుమానం వద్దు/ పెనుభూతం/ ప్రశాంతతతో/ శరాఘాతం./ అనుమానం పెనుభూతం లాంటిది. కావున ప్రశాంతంగా ఉంటే అన్ని విధాలా శ్రేయస్కరం అంటూ అనుమానస్తులకి చురక వేశారు రవి. ఈ నానీ చూడండి. చాలా అర్థవంతంగా ఉంది. జీవితం/ గజి బిజీ అయిపోయింది/ చిక్కుకుంది/ అంతర్జాలంలో. కంప్యూటర్‌ యుగంలోకి అడుగుపెట్టిన నేటి మానవుని దుస్థితి వలలో చిక్కుకున్న చేపపిల్లలా అయోమయంగా తయారైందని ఫోన్లో మునిగితేలుతున్న వారి దుస్థితిని చక్కగా చెప్పారు.
    మనసు పాత్రలో/ నానీలు ఉడికాయి/ హాయిగా/ ఆస్వాదించండి./ అంటే తన మనసు లోలోతుల్లో నుంచి వచ్చిన ఈ నానీలు చాలా చక్కగా ఉన్నాయి. వాటిని చదివి నిగూడార్ధాన్ని ఆస్వాదించండని చెప్పారు కవి. విడివిడిగా/ ఉంటూనే/ కలివిడిగా మెలగడమే/ క్రమశిక్షణ./ ఈ నానీ కుటుంబ బంధాలకి చక్కని ప్రతీక. కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కలిసి ఉండి రోజు అవాకులు చవాకులు పేల్చుకొనే కంటే ఎవరికి వారు వేర్వేరుగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవడంలోనే ఆనందం ఉందంటారు రవి. ఆకలి నైనా/ భరిస్తాను/ వేధింపులతో మాత్రం/ మనసు వికలం. అంటే ఎంత ఆకలిగా ఉన్నా తట్టుకోవచ్చు గానీ ఎదుటివారు వేపుకు తింటే మాత్రం మనసు ముక్కలవుతుందని బాధను వ్యక్తం చేశారు. ఎక్కడుంది/ నేటి ప్రజాస్వామ్య/ కార్పొరేట్‌ బాసుల/ కనుసన్నల్లో అంటూ ప్రభుత్వానికి చురక వేశారు. అధికారాలన్నీ బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయని నిజాన్ని నిర్భయంగా చెప్పారు.
    వరి కోతలు/ గుండెకోతలైనాయి/ కొడవళ్ళు కురిసాయి/ వడగళ్ళు./ ఈ నానిలో రైతన్నల ఈతిబాధలను ఆవేదనగా చెప్పారు. పంట పండే సమయానికి అకాల వర్షంతో వడగండ్ల వానతో పంట దెబ్బతిని రైతన్నలకు గుండెకోతలను మిగిల్చాయి అంటూనే కాలాలు కూడా గతి తప్పుతున్న వైనాన్ని బాధాతప్త హృదయంతో చెప్పారు. అమ్మా!/ అమ్మేయకే/ ఆడపిల్లను కదే/ నీకైనా కనికరం లేదు./ ఈ నాని ఆవేదన భరితంగా ఉంది. కొంతమంది తల్లులు పురిట్లో పిల్లల్ని అమ్ముకుంటుంటే 'అమ్మా నువ్వు కూడా ఆడపిల్లవి కదా ఒక్కసారి ఆలోచించు నన్ను అమ్మొద్దు' అంటున్న ఆడబిడ్డ ఆవేదనని ఎంతో హృద్యంగా చెప్పారు కవి.
స్వాములకు/ స్కాములకు ఆలవాలం/ సమాజం/ కార్పొరేట్‌ అవినీతిమయం./ అంటే ఈ సమాజం దొంగ స్వాములతో, అవినీతిపరులతో నిండిపోయింది. న్యాయదేవత/ కళ్ళు తెరిచింది/ ప్రమాదపు అంచులలో/ ప్రజాస్వామ్యం./ ఇన్నాళ్లు నాయకులు గాని నాయకులు న్యాయదేవత కళ్ళుగప్పి బడాబాబుల్లా చలామణి అవుతూ పాలన సాగించారు. ఇహ వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే దేశం ప్రమాదంలో చిక్కుకుంటుందని, వారికి తగిన గుణపాఠం చెప్పడానికి న్యాయదేవత కూడా కదిలిందని నేటి నాయకులకు తెలియజేశారు కవి. ఏ పార్టీ వకాల్తా/ పుచ్చుకున్నా తంతా/ ఇది ఊరు/ ఒకే కుటుంబమనే ఛత్రం./ నేటి విద్వేష నాయకులకు హెచ్చరిక ఈ నానీ. 'ఊరు ఊరంతా ఒకే గొడుగు నీడలో ఉన్నాం. విభజన కబుర్లు చెబితే మిమ్మల్ని కొడతాం జాగ్రత్త' అంటూ చురకలు వేశారు కవి.
    ముందుకే/ అడుగు వేయి/ పడిగాపుల/ వడగాల్పులు తట్టుకోలేం./ పడిగాపుల్ని వడగాల్పులతో పోల్చి ఎదురు చూపు చూడడం మానేసి నీ జీవన ప్రయాణంలో ముందుకు సాగితే అంతా విజయమే అంటూ చక్కని జీవన సత్యాన్ని చెప్పారు ఈ నానీలో. నాన్న జ్ఞాపకాలు/ ఎంత బాగున్నాయో/ మనసంతా/ నిండు పున్నమి. ఈ నానీలో నాన్నపై అభిమాన ధనాన్ని కురిపించారు రవి. నాన్న మిగిల్చిన జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఒకింత ఆనందంతో చెప్పారు. పోయాక నాన్న విలువ/ తెలిసేమీ తరుణం/ ఉన్నప్పుడు/ ప్రాపుకోని వైనం.. నాన్న ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోకుండా చనిపోయాక బాధపడి ప్రయోజనం లేదు అంటూ 'నాన్నని నీ బిడ్డలాగా ప్రేమగా చూసుకో'మని చక్కని సూచన చేశారు కవి. నిజాయితీపరుడి/ ముందు/ నిబంధనలు మోకరిల్లు/ కాలం తలవంచు. నిజాయితీగా ఉండడంలోని గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పి ఈ నానీల సంపుటికి చక్కని ముగింపునిచ్చారు కవి.
ఇంకా ఈ సంపుటిలో 'కార్పొరేట్‌ చదువులు, అమ్మ మమకారం, నేటి నాయకులు, సెల్‌ ఫోన్‌ వెతలు, తెలుగు భాష, కార్మిక శ్రమ' పై నానీలు ఎంతో చక్కగా అలరించాయి. ఈ కవి దక్షిణాసియా విశ్వవిద్యాలయాల సాంస్క ృతిక పురస్కారం, పాలకొల్లు కళాలయ పురస్కారం, శ్రీశ్రీ జాతీయ అవార్డు, మచిలీపట్నం వారి కవితా ప్రతిభ పురస్కారం అందుకున్నారు. భోజంకి వెంకట రవి కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ఆశిద్దాం.
 

- పింగళి భాగ్యలక్ష్మి
97047 25609