Jul 03,2022 22:32

ఎక్స్‌పోను ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఫొటో, వీడియో గ్రాఫర్లు వృత్తి నైపుణ్యన్ని మెరుగుపర్చుకుంటే ఈ రంగంలో మరింతగా రాణించగలుగుతారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, రాజమండ్రి గోదావరి జోన్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌, రాజమండ్రి వీడియో అండ్‌ ఎడిటింగ్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ్ద ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇమేజింగ్‌ ఎక్స్‌పో 'గోదావరి ఫొటోఫిన'ను ఆదివారం స్థానిక చెరుకూరి వీర్రాజు, సుబ్బలక్ష్మి కన్వెన్సన్‌ సెంటర్‌లో ఆయన జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మంచి టాలెంట్‌ ఉన్న యువ ఫొటోగ్రాఫర్లు అనేకమంది ఈ రంగంలోకి వస్తున్నారన్నారు. కేవలం డిజిటల్‌ కెమోరాలతోనే సినిమాలను తెరకెక్కించేటంత టాలెంట్‌ వారిలో ఉంటుందన్నారు. గోదావరి తీరం ఫొటోగ్రఫీ, సినిమా చిత్రీకరణకు ఎంతో అనుకూలమైన ప్రదేశమన్నారు. ఇక్కడ చిత్రీకరించిన చిత్రాలన్నీ ఘన విజయాలు సాధించాయని గుర్తుచేశారు. ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఇటువంటి ఎక్స్‌పోను వినియోగించు కోవాలన్నారు. షార్ట్‌ఫిల్మ్‌, సినిమాలు తెరకెక్కించడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు, పేరుప్రతిష్టలు వస్తాయన్నారు. ఎక్స్‌పో నిర్వాహకులను అభినందించారు. ఎక్స్‌పోను రుడా చైర్మన్‌ ఎం.షర్మిలరెడ్డి, వైసిపి సిజిసి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, జనసేన రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ అధ్యక్షులు వైఎ.శ్రీను, ఫ్రింటోనికా అధినేత సత్యవరపు గోకుల మురళి తదితరులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లహరి శంకర్‌, సెక్రటరీ మాధవరావు, చైర్మన్‌ ఎన్‌వివి.ప్రసాద్‌, జిల్లా ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పోసిన వీరేంద్ర, కార్యదర్శి కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు కోని శ్రీను, సాయిబాబా, రాజమండ్రి గోదావరి జోన్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ మయూరి శివ, కార్యదర్శి ఎస్‌ఎస్‌ శేఖర్‌, గౌరవాధ్యక్షులు అల్లు బాబి, గౌరవ సలహాదారు ఎపి నారాయణరావు, కేతా శ్రీనివాస్‌, ఎక్స్‌పో నిర్వాహకులు ఎడిట్‌ పాయింట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు రక్తదానం శిబిరం ఏర్పాటుచేసి రక్తదానం చేశారు. డ్రోన్‌ కెమెరాను వినియోచడంపై సెమినార్‌ నిర్వహించి, అవగాహన కల్పించారు.