జకార్తా : భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు వరుసగా ఈ నెలలో సంభవించిన ప్రకృతి విపత్తులతో ఇండోనేషియా అతలాకుతలమైంది. గతవారం సంభవించిన వరదల్లో ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని కొండను ఆనుకుని ఉన్న గ్రామాలు చిక్కుకున్నాయి. ఈ వరదల వల్ల భారీగా చేరిన బురద మట్టిలో చాలామంది చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడి కొందరు సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో తాజాగా రెస్క్యూ సిబ్బంది పది మంది మృతదేహాలను వెలికితీశారని, ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
కాగా, గతవారం కురిసిన కుండపోత వర్షాల వల్ల పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సుకబూమి జిల్లాలో 170కి పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. దాదాపు 31 వంతెనలు కూలిపోయాయి. 81 రోడ్లు ధ్వంసమయ్యాయి. 539 హెక్టార్లలో పంట నాశనమైంది. 1,170 ఇళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల దాదాపు మూడు వేల మంది నిరాశ్రయులయ్యారని, వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారని రెస్క్యూ బృందానికి నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ కల్నల్ యుడి హరియంతో తెలిపారు. సోమవారం రెస్క్యూ వర్కర్లు తీగల్‌బులీడ్, సింపెనన్, సీమాస్ గ్రామాల్లో పది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గల్లంతయిన ఇద్దరి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు అని హరియంతో చెప్పారు.