విమాన ప్రమాదం: మాలావి ఉపాధ్యక్షుడు సహా 10మంది మృతి

లిలాంగ్వె : ఆగ్నేయాఫ్రికా దేశమైన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్‌ క్లాజ్‌ చిలిమా ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో తొమ్మిది మంది కూడా మరణించారు. విమానంలోనివారెవరూ జీవించిలేరని అధ్యక్షుడు లాజరస్‌ చాక్వెరా తెలిపారు. విమానం అడవిలో కూలిపోయిందని తెలిపారు. ఆ సమయంలోఉపాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుని భార్య, ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు మిలటరీ సిబ్బంది వున్నారు. సోమవారం రాజధాని నగరం నుండి సోమవారం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన విమానం 45నిముషాల తర్వాత ముసుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి వుంది. కానీ విమానం బయల్దేరిన కొద్దిసేపటికే రాడార్‌లో విమానం మాయమైంది. మూడు రోజుల క్రితం మరణించిన కేబినెట్‌ మంత్రి రాల్స్‌ కసంబా అంత్యక్రియంల్లో పాల్గనేందుకు చిలీమా, మలావి మాజీ అధ్యక్షుని భార్య, యునైటెడ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పార్టీకి చెందిన ప్రతినిదులు విమానంలో బయల్దేరి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. విమాన ప్రమాద వార్త తెలియగానే అధ్యక్షుడు లాజరస్‌ చాక్వెరా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని, సహాయక చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. చిలీమా 2014 నుండి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారని భావించారు. 2022లో ఆయనపై ముడుపుల ఆరోపణలు రావడంతో అరెస్టు చేశారు. అయితే గత నెల్లోనే ఆయనపై అభియోగాలను కోర్టు ఉపసంహరించింది. ఈ కేసును కొనసాగించాలనుకోవడం లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ నోటీసులు పంపడంతో కోర్టు కేసును మూసేసింది.

➡️