బీరుట్ (సిరియా) : సిరియాలో మళ్లీ భయంకరమైన మారణకాండ జరిగింది. గత రెండు రోజులుగా సిరియా ఘర్షణలతో అట్టుడికిపోతుంది. ఈ ఘర్షణల్లో 1000మంది మరణించారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య ఘర్షణ రాజుకుంది. ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. గత శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. అలవైట్‌లను ఊచకోత కోశారని స్థానికులు చెప్పారు. అయితే మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 1000 మంది మరణించగా, వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థల సమాచారం. దీంతో … సిరియా మారణహోమంగా మారింది. మృతదేహాలు నడివీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం …. ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితోపాటు అసద్‌కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ , తాగునీటిని నిలిపివేశారని, బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ వెల్లడించింది. ఇదిలాఉండగా.. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి పేర్కొంది. అసద్‌ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి.
