- దెబ్బ తిన్న పలు జల విద్యుత్ ప్రాజెక్టులు
ఖాట్మండూ (నేపాల్) : నేపాల్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడడం, వాగులు వంకలు పొంగి పొర్లడంతో ఇప్పటివరకు 148 మంది చనిపోయారు. 59 మంది గల్లంతయ్యారు. పదకొండు జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతినిపోయాయి. విద్యుత్ ప్రాజెక్టులకు జరిగిన నష్టం 245 కోట్ల దాకా ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇది కాకుండా ఆస్తినష్టం కూడా పెద్దయెత్తున ఉన్నట్లు నేపాల్ విద్యుత్ శాఖ మంత్రి దీపక్ ఖద్కా తెలిపారు.కొండచరియలు విరిగి పడడం వల్ల పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పలు బస్సులు మట్టి పెళ్లల కింద చిక్కుకుపోయాయి. 3,660 మందిని ఆర్మీ, నేపాలీ సాయుధ దళాలు, పోలీసులు రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఖాట్మండూ వ్యాలీలోనే 73 మంది మరణించారు. కోషి రాష్ట్రంలో 17 మంది, బాగ్‌మతి ప్రావిన్స్‌లో 56 మంది చనిపోయారు. వరద ధాటికి పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయని, దాదాపు 1200 ఇళ్ల్లు వరద నీటిలో మునిగాయని తెలిపారు..నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు బీహార్‌ను కూడా తాకే ప్రమాదముందని అధికారులు తెలిపారు.