పెషావర్ : పాకిస్తాన్‌లోని రెస్టివ్ ఖైబర్ ఫక్తూన్‌ఖవా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని సాయుధాలు 16 మంది నిర్మాణ రంగ కార్మికులను కిడ్నాప్ చేశారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న వీరంతా నిర్మాణ ప్రాంతానికి వాహనంలో వెళుతుండగా అపహరించారు. ఆ వాహనానికి నిప్పంటించారు. ఈ ప్రాంతంలో నిషేధిత తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) పనిచేస్తోంది, పైగా గతంలో ఇలాంటి అపహరణలకు పాల్పడిన సమాచారం వుంది. అల్‌ఖైదాకు సన్నిహితంగా పని చేస్తున్న ఈ సంస్ధ అనేక రకాలుగా దాడులు సాగిస్తోంది. మరో సంఘటనలో ట్యాంక్ జిల్లాలో 25కిలోల బాంబును అధికారులు నిర్వీర్యం చేశారు. వాయవ్య పాకిస్తాన్‌లోని మారుమూల జిల్లాలో డజన్ల సంఖ్యలో సాయుధ బలూచ్ వేర్పాటువాదులు అరాచకం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారు. ఒక పోలీసు స్టేషన్‌ను పాక్షికంగా దగ్ధం చేశారని పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా బలగాలు వచ్చేలోపు వారక్కడ నుండి పారిపోయారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని చెప్పారు. కాగా బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్‌లో బుధవారం జరిగిన దాడికి తమదే బాధ్యత అని నిషేదిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో వాయవ్య ఖైబర్‌ఫక్తునువా ప్రావిన్‌ఐస, బలూచిస్తాన్‌ల్లో తీవ్రవాదుల హింస పెరిగింది. బలూచ్ ఆర్మీ, పాకిస్తాన్ తాలిబన్ ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబన్ 2021లో పొరుగున వున్న ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాక్ తాలిబన్‌కు ధైర్యం వచ్చింది. దాంతో వారు ఈ మధ్య ఎక్కువగా దాడులకు దిగుతున్నారు.